కరోనాపై పరిశోధన చేస్తున్నారా? 

7 Apr, 2020 02:09 IST|Sakshi

వర్సిటీ రిజిస్ట్రార్లతో గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌

ఉన్నతవిద్య సిలబస్‌ ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పూర్తి కాని సిలబస్‌ను ఆన్‌లైన్‌లో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీల రిజిస్ట్రార్లను గవర్నర్, యూనివర్సిటీల చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ పోర్టల్స్, స్వయం మూక్స్‌ వంటి దూరవిద్య పోర్టల్స్, యూనివర్సిటీల పోర్టల్స్‌ సహకారంతో సిలబస్‌ పూర్తి చేయాలని సూచించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో తమిళిసై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్‌ ఎంతవరకు వచ్చిందనే దానిపై సమీక్షించారు. తమ సొంత ఆన్‌లైన్‌ సర్వీసులతోపాటు ఏఐసీటీఈ, యూజీసీ పోర్టల్స్‌ ద్వారా సిలబస్‌ను పూర్తి చేస్తామని రిజిస్ట్రార్లు ఆమెకు తెలిపారు. మరోవైపు వర్సిటీల్లో కోవిడ్‌ సంబంధిత పరిశోధనలు, అధ్యయనాలేమైనా జరుగుతున్నాయా అని గవర్నర్‌ ఆరా తీశారు. తాము దీనిపై విశ్లేషిస్తున్నామని, శాంపిల్స్‌ సేకరించి పరిశీలిస్తున్నామని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు చెప్పినట్టు తెలిసింది. కరోనా కట్టడి చర్యలు, సహాయక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు