సాంకేతిక సవాళ్లు అధిగమించాలి

13 Dec, 2019 02:32 IST|Sakshi
స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

దేశ రక్షణలో ఆధునిక టెక్నాలజీ పాత్ర కీలకం   గవర్నర్‌ తమిళిసై వెల్లడి 

సాక్షి, బొల్లారం: దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 96వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు సంబంధించి కాలాన్ని బట్టి ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా ఎంసీఈఎంఈ మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అణు దాడులు, సైబర్‌ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

దేశ రక్షణ కోసం త్రివిధ దళాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  ట్యాపింగ్‌ లేని సెల్‌ఫోన్‌ వ్యవస్థ రావాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కంప్యూటర్లు హ్యాక్‌ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 100వ డిగ్రీ ఇంజనీరింగ్‌ కోర్సులో (డీఈ–100) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్‌ నరేంద్ర గోరాకు డీజీఈఎంఈ ట్రోఫీని, 32వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీం కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లెఫ్టెనెంట్‌ బదూర్‌సింగ్‌తో పాటు 64 మంది అధికారులకు గవర్నర్‌ తమిళిసై ట్రోఫీ లను అందజేశారు.   

>
మరిన్ని వార్తలు