పంచాయతీలకు ‘కో ఆప్షన్‌’

15 Jul, 2019 08:43 IST|Sakshi
సంగెం గ్రామపంచాయతీ కార్యాలయం

పంచాయతీకి ముగ్గురు కోఆప్షన్‌ సభ్యుల నియామకం

వార్డు సభ్యులతో సమాన హోదా

జిల్లాలో 1,203 మందికి అవకాశం..!

సాక్షి, సంగెం: గ్రామ పంచాయతీల్లో ఇక కో ఆప్షన్‌ సభ్యులను నియమించబోతున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం 2018 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనున్నది. గతంలో కనీవిని ఎరుగని విధంగా ప్రతి పంచాయతీ పాలకవర్గంలో కోఆప్షన్‌ సభ్యులను నియమించుకునేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల మాధిరిగా గ్రామపంచాయతీలకు సైతం కోఆప్షన్‌ సభ్యుల నియామకాన్ని పొందుపరిచారు. దీంతో నూతన పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నది. పంచాయతీ పాలనపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు, విధులపై శిక్షణ తరగతులను నిర్వహించారు.

కొత్త చట్టం ప్రకారం ఇక కో ఆప్షన్‌ సభ్యుల నియామక ప్రక్రియ మిగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక విధానంపై మార్గదర్శకాలు జారీ చేస్తే ఆయా పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్‌ సన్నిహితులు, విధేయులకు అవకాశం లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటుగా గ్రామానికి చెందిన ముగ్గురిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేసుకుంటే వారి విలువైన సలహాలను గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం కొంత మేరకు తోడ్పాటు లభించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నూతనంగా ఎంపిక కాబోయే కో ఆప్షన్‌ సభ్యులకు వార్డు సభ్యులతో సమాన హోదా లభించనుంది. గ్రామపంచాయతీల్లో తీర్మాణం చేసే సమయంలో చేసే చర్చలో వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల, జిల్లా పరిషత్‌ స్థాయిలో కో ఆప్షన్‌ సభ్యులను నామినేట్‌ చేసినట్లుగా గ్రామపంచాయతీల్లోను ముగ్గురిని నామినేట్‌ చేసి వారి ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకునోవాలనేది ప్రభుత్వ వ్యూహం. అందులో భాగంగా ప్రతి పంచాయతీకి ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను నియమించేందుకు కార్యాచరణ రూపొందించారు. 

వీరికే అవకాశం..
ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. గ్రామాల్లో విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, సంఘ సంస్కర్తలు, గ్రామాభివృద్ధికి కోసం ఇదివరకే కృషిచేసేవారిలో వంటి వారి నుంచి ముగ్గురిని పంచాయతీకి నియమించనున్నారు. ఈ ముగ్గురు గ్రామాల్లో నివసిస్తున్నవారు అయి ఉండాలి. వీరిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు.

జిల్లాలో 401 గ్రామపంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురి చొప్పున 1,203 మంది కోఆప్షన్‌ సభ్యులను నియమించనున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేరకు రాజకీయ నిరుద్యోగులకు ఊరట కలగనుంది. ఈ కోఆప్షన్‌ సభ్యులను నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపిక చేసి మండల అధికారులకు జాబితా అందిస్తారు. జాబితా అందిన తర్వాత మండల అధికారి సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. పలువురు ఆశావాహులు మండలస్థాయి నాయకులతో కలిసి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి గ్రామ కోఆప్షన్‌గా అవకాశం కల్పించాలని మంతనాలు జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు