ప్లాస్టిక్‌పై బదులు తీర్చుకుందాం!

22 Sep, 2019 03:05 IST|Sakshi

వస్తు వినిమయ పద్ధతిలో ప్లాస్టిక్‌ సేకరణ 

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగమే కాదు.. ప్రజలు కూడా నడుం బిగించాలి. అప్పుడే ఈ మహమ్మారిని మన దరిదాపుల్లో కూడా లేకుండా తరిమేయడం సాధ్యం అవుతుంది. అందుకోసం ప్రజల్లో అవగాహన ఎంతో అవసరం. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేయాలంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేయడంలో భాగంగా వ్యర్థాల సేకరణ పాలక వర్గాలకు సవాలుగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. వస్తు వినిమయ పద్ధతిలో ప్లాస్టిక్‌ను పాతరేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండొనేసియాలో సముద్రంలో ప్లాస్టిక్‌ కాలుష్యం చాలా ఎక్కువ. దీన్ని అడ్డుకునేందుకు పది ప్లాస్టిక్‌ కప్పులు, ఐదు ప్లాస్టిక్‌ బాటిళ్లు ఇస్తే.. దానికి బదులుగా బస్సులో గంట పాటు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. అచ్చం మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఇలా వస్తు వినిమయ పద్ధతిలో ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు.. ఎక్కడెక్కడో తెలుసుకుందామా మరి..! 

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీలో అధికారులు మరో రకంగా ఆలోచించారు. చెత్త ఏరుకునే వారు 500 గ్రాముల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకొస్తే.. దానికి బదులుగా వారికి భోజనం పెడుతున్నారు. ఈ నిర్ణయంతో అటు ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేయొచ్చు.. ఇటు భోజనం చేయలేని వారి కడుపు నింపినట్లు అవుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ మనోజ్‌ సింగ్‌ వివరించారు. 

స్కూల్‌ ఫీజుగా.. 
అసోంకు చెందిన మజిన్‌ శర్మ, పారమితలు 2016లో ‘అక్సర్‌’పేరుతో ఓ పాఠశాలను ప్రారంభించారు. ఆ స్కూల్‌లో చేరిన పిల్లలకు ఫీజు ఏంటో తెలుసా.. ప్లాస్టిక్‌. అవును స్కూల్‌ ఫీజుకు బదులు 25 ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకురావాలి. ఈ స్కూల్‌లో ఉన్న దాదాపు వంద మంది పిల్లలు రోజూ తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు స్కూల్‌ సిబ్బంది వేరు పరిచి.. రీసైకిల్‌ చేస్తారు. ఉదాహరణకు.. ప్లాస్టిక్‌ బాటిళ్లను సగానికి కోసి.. మొక్కల కుండీలుగా వాడుతారు. 

ఉచిత భోజనం.. 
పశ్చిమ బెంగాల్‌
500 గ్రాముల ప్లాస్టిక్‌ తీసుకొచ్చిన ఎవరికైనా ఉచిత భోజనం అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో గోథెల్స్‌ మెమోరియల్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు, నిష్కామ ఖల్సా సేవా సంఘం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. 

ప్లాస్టిక్‌ ఇవ్వండి.. రీచార్జ్‌ చేసుకోండి.. 
ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసేందుకు మన రైల్వే కొత్త పంథాలో వెళ్తోంది. దేశంలోని 128 రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్‌ను క్రష్‌ చేసేందుకు దాదాపు 160 మెషీన్లు ఉన్నాయి. ఇంకా 400 మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకమేంటంటే.. మనం ప్లాస్టిక్‌ బాటిళ్లను ఇస్తే వాటికి తగ్గట్టు మన మొబైల్‌ ఫోన్‌లో రీచార్జ్‌ చేస్తారు. సేకరించిన ఆ బాటిళ్లను క్రష్‌ చేసి.. రీసైకిల్‌ చేస్తారు. 

చాయ్‌ చటుక్కున తాగేయ్‌.. 
ప్రయాగరాజ్‌లో ఏటా జరిగే కుంభమేళాలో టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగవుతుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రయాగరాజ్‌ నగర నిగమ్‌ (మున్సిపాలిటీ) అక్క డక్కడా చిన్న చిన్న టీ యంత్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ యంత్రాల్లో డబ్బులు కాకుండా.. ప్లాస్టిక్‌ వ్యర్థాల ను వేస్తే వేడి వేడి చాయ్‌ అందిస్తాయి. రోజూ సాయంత్రం ఆ ప్లాస్టిక్‌ను పారిశుధ్య కార్మికులు సేకరించి రీసైకిల్‌ చేస్తారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా