భూమి విలువ పెరగనట్టేనా? 

15 Jun, 2019 02:18 IST|Sakshi

ఈసారీ భూముల మార్కెట్‌ విలువ సవరణపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

ఇప్పుడు సర్కారు ఓకే చెప్పినా ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు నెలలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూముల మార్కెట్‌ విలువ సవరణ ఈ ఏడాదీ జరిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు జరగని ప్రక్రియకు ఈ ఏడాదైనా అనుమతి వస్తుందని భావించినా, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రావాల్సిన సవరణ విలువలు వచ్చేలా లేవు. ఇప్పుడు అనుమతినిచ్చినా ప్రక్రియ పూర్తికి 3నెలలు పడుతుందని, అక్టోబర్‌ నాటికి సవరించిన విలువలు అందుబాటులోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నా.. భూముల మార్కెట్‌ విలువలను సవరించే ప్రక్రియపై సర్కారు ఏమీ తేల్చకపోవడంతో ఈ ఏడాదీ సవరణలు జరిగే అవకాశం లేదని వారు భావిస్తున్నారు.  

ఆరేళ్ల విలువల ఆధారంగానే.. 
భూముల క్రయ, విక్రయ లావాదేవీలతో పాటు నష్టపరిహారం చెల్లింపులోనూ మార్కెట్‌ విలువే కీలకం కానుంది. అయితే, ఉమ్మడి ఏపీలో ఆరేళ్ల క్రితం 2013లో మార్కెట్‌ విలువను సవరించగా అప్పటి నుంచి అవే ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, మార్పుల కారణంగా బహిరంగ మార్కెట్‌లో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. ఆరేళ్ల నుంచి మార్కెట్‌ విలువలో హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొన్ని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ల విలువను రెండింతలు ఎక్కువగా వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతో భూముల మార్కెట్‌ విలువలను సవరించి సహేతుక ధరలను నిర్ధారించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశలో నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ ఏడాదీ భూముల విలువలను సవరించే ప్రక్రియకు అనుమతినివ్వాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.  

50 శాతం అదనపు ఆదాయం 
ఈ ఆరేళ్ల నుంచి కనీసం 2 సార్లు సవరణ జరగాల్సిన భూముల విలువలు ఆరేళ్ల క్రితం విలువలతోనే ఆగిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. మార్కెట్‌ విలువల సవరణలు జరిగితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల ద్వారా 50శాతం ఆదాయం లభిస్తుందని అధికారులు చెపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.5,700 కోట్ల ఆదాయం రాగా, మార్కెట్‌ విలువలను సవరిస్తే అది రూ.8,500 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపి అక్టోబర్‌ నుంచి సవరించిన మార్కెట్‌ విలువలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం భూముల విలువలను సవరించేందుకు ససేమిరా అంటుండడం గమనార్హం.

సిద్ధమైనా.. పెద్ద కసరత్తే
భూముల మార్కెట్‌ విలువల సవరణ ప్రక్రియకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను నియమించుకోవాలి. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, వ్యవసాయేతర భూములకు జాయింట్‌ కలెక్టర్లు కన్వీనర్లుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల, గ్రామాల వారీగా భూముల మార్కెట్‌ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే, ప్రభుత్వ ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. అయితే, ఆనవాయితీ ప్రకారం భూముల మార్కెట్‌ విలువలు ఎప్పుడు సవరించినా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతించినా ఆగస్టు1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు