దేవాలయాల లీజు భూములపై సర్కార్‌ నజర్‌ 

15 Jun, 2019 01:53 IST|Sakshi
యాదాద్రి సమాచార కేంద్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు 

దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం 

అర్చకుల సంక్షేమానికి పెద్దపీట, ఉద్యోగుల వేతన సమస్య పరిష్కారం 

ఆలయాల షాపులను సబ్‌లీజ్‌కు ఇస్తే చర్యలు 

దేవాదాయ శాఖ సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగుల వేతన సమస్యల పరిష్కారం, ఆలయ భూముల పరిరక్షణ, లీజు భూములు, ఆన్‌లైన్‌ సేవలు, తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దేవాలయ భూములకు సర్వే చేసి, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయశాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకుని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్‌లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ భూముల ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగుల పే స్కేల్‌ విషయంలో వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.  

దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం 
దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు, ప్రత్యమ్నాయ మార్గాలను చూడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయాల్లో స్వామి వారికి సరిగా ధూపదీపం అందుతుందో లేదో అనే విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. దేవాలయాల్లో ఆర్జిత సేవల నుంచి గదులను ఫోన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఆలయాల్లో దశలవారీగా బెల్లంతో తయారు చేసిన లడ్డూలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు, రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ కృష్ణవేణి, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, వివిధ జిల్లాల అసిస్టెంట్‌ కమిషనర్లు, ఈవోలు పాల్గొన్నారు.  

యాదాద్రి కల్యాణ మండప భవనం ప్రారంభోత్సవం 
బర్కత్‌పురాలోని రూ.8 కోట్లతో నిర్మించిన యాదాద్రి సమాచార కేంద్రం, కల్యాణ మండప భవనాన్ని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసన మండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిలతో కలసి ఆయన ప్రారంభించారు. భవన ప్రారంభం అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ప్రసాదం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్, ఈవో గీత, ఫౌండర్‌ ట్రస్టీ నర్సింహమూర్తి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు