అక్రమ లేఅవుట్లపై సర్కార్‌ కొరడా 

10 Feb, 2019 03:38 IST|Sakshi

పంచాయతీల్లో సర్కార్‌ కట్టుదిట్టమైన చర్యలు 

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తే సర్పంచ్‌తోపాటు సెక్రటరీపైనా చర్యలు 

పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేసిన సర్కార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు చట్టాన్ని కఠినతరం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల శివార్లలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల వల్ల కోర్టు కేసులు, వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో చట్టంలో మార్పులు, చేర్పులు చేపట్టింది. గ్రామాల్లో అక్రమ లే అవుట్లకు, అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అంశాన్ని నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం చేర్చింది. సంబంధిత గ్రామాల పరిధిలో అప్పటికే ఏర్పడిన లే అవుట్ల జాబితాలను కూడా పంచాయతీలు సిద్ధం చేసి ప్రకటించాల్సి ఉంటుంది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టాక వెలిసే అక్రమ లే అవుట్లు, ఆక్రమణలు, నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. తదనుగుణంగా అక్రమ లేఅవుట్లు, తదితరాలపై కచ్చితమైన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం పని సులువు కానుంది.  

నియంత్రణ చర్యలు.. 
వ్యవసాయ భూమిని సొంతదారు లేదా డెవలపర్‌ లేఅవుట్‌గా అభివృద్ధి చేసి భవనాల నిర్మాణం చేపట్టడానికి ముందే దీనికి సంబంధించి గ్రామపంచాయతీకి దరఖాస్తు(ఒక దరఖాస్తు ప్రతిని టెక్నికల్‌ శాంక్షన్‌ అథారిటీకి పంపించాలి) చేసుకోవాలి. వ్యవసాయేతర అవసరాల కోసం వ్యవసాయభూమిని మార్చుకున్నాకే ఈ దిశలో చర్యలు చేపట్టాలి. ఈ దరఖాస్తును సాంకేతిక మంజూరు కోసం ఏడురోజుల్లోగా టెక్నికల్‌ శాంక్షన్‌ కమిటీకి పంచాయతీ పంపించాలి. నిర్ణీత గడువులోగా ఇది జరగకపోతే శాంక్షన్‌ కమిటీకి ఈ ప్రతిపాదన ఫార్వర్డ్‌ అయినట్టుగా పరిగణిస్తారు. లేఅవుట్‌లో భాగంగా రోడ్ల ప్రణాళిక, మురుగుకాల్వలు, మంచినీరు, వీధిదీపాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ కమిటీ 30 రోజుల్లోగా భూమి సొంతదారు లేదా డెవలపర్‌కు తెలియజేస్తుంది. కామన్‌గా ఉండే స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీకి రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది.

లే అవుట్‌ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అంశాలు పూర్తి చేసినట్టుగా సొంతదారు లేదా డెవలపర్‌ నుంచి లేఖ అందాక ప్రతిపాదిత లేఅవుట్‌ను శాంక్షన్‌ అథారిటీ పరిశీలిస్తుంది. అన్ని సరిగ్గా ఉంటే 30 రోజుల్లోగా తుది మంజూరునిస్తారు. నిబంధనలు పాటించకపోతే నెలరోజుల్లోగా సదరు దరఖాస్తును కమిటీ తిరస్కరిస్తుంది. ఈ మేరకు శాంక్షన్‌ అథారిటీæ నుంచి వర్తమానం అందాక వారం రోజుల్లోగా పంచాయతీ లేఅవుట్‌కు మంజూరునివ్వడమో లేదా దరఖాస్తు తిరస్కరిస్తున్నట్టు తెలియజేయడమో చేస్తుంది. శాంక్షన్‌ అథారిటీ అధికారి నిర్ణీత గడువులోగా మంజూరు చేయకపోతే అతడిపైనా క్రమశిక్షణా చర్య, జరిమానాతో పాటు పదోన్నతులు కల్పించకుండా చర్య తీసుకునే అవకాశాన్ని కొత్తచట్టంలో కల్పించారు. పంచాయతీ నుంచి మంజూరు లభించిన తేదీ నుంచి అన్ని లేఅవుట్లు రెండేళ్ల కాలపరిమితిలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆలోగా ఆ లే అవుట్‌ను పూర్తి చేయలేకపోతే అది రద్దవుతుంది.  

ఇళ్ల నిర్మాణానికి అనుమతులు... 
కొత్తచట్టంలో భాగంగా పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కొత్త భవనాలు కట్టడం లేదా ఉన్న ఇంటికే మార్పు లు, చేర్పులు చేసేందుకు అవకాశం లేదు. మూడు వందల చదరపు మీటర్ల వరకు స్థలంలో పది మీటర్ల ఎత్తులో జీప్లస్‌ టు నివాస భవనాలకు మాత్రమే పంచాయతీ అనుమతినివ్వొచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవననిర్మాణ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి ఈ దరఖాస్తును పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చాకే ఈ మంజూరు ఇస్తారు. చెల్లుబాటయ్యే అన్ని పత్రాలు సమర్పించినా పంచాయతీలు వారంలోగా మంజూరు ఇవ్వడంలో విఫలమైతే భవననిర్మాణానికి అనుమతినిచ్చినట్టుగా భావించేలా చట్టంలో ఏర్పాటు చేశారు. జీ ప్లస్‌ టు పరిమితులకు మించి నిర్మించే భవనాలకు టెక్నికల్‌ శాంక్షన్‌ అథారిటీ అనుమతినివ్వాల్సి ఉంటుంది. అక్రమ లే అవుట్లుగా గుర్తించిన వాటిని క్రమబద్ధీకరించే అధికారం అథారిటీకి ఉంది. 

మరిన్ని వార్తలు