ఇక సర్కారీ ఇన్సూరెన్స్‌ 

25 Oct, 2017 03:33 IST|Sakshi

పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వం: ఎంపీ గుత్తా

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పత్తి సాగు చేసిన రైతుల కోసం పంజాబ్, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కంపెనీలు ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాచారం తెప్పించుకొని, లోటుపాట్లపై అధ్యయనం చేయిస్తున్నారని తెలిపారు.

ఎకరా పత్తికి రూ.33 వేలు ఇన్సూరెన్స్‌ చేస్తారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 10 శాతం చొప్పున ప్రీమియం చెల్లిస్తే.. రైతు ఐదు శాతం అంటే రూ.1,650 ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం ఎక్కువగా ఉండటంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో ఎక్కువ మంది రైతులు ఇన్సూరెన్స్‌ చేయించుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ముఖ్యమంత్రి పలుసార్లు చర్చించారన్నారు. గత ఏడాది పలు బ్యాంకుల ఇన్సూరెన్స్‌ కంపెనీల లాభం రూ.16 వేల కోట్లు ఉందని, రైతులకు రావాల్సింది వాళ్లు లాభాల్లో చూపించుకుంటున్నారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు