కబ్జా గుప్పిట్లో సర్కారు భూమి

17 Sep, 2018 12:04 IST|Sakshi
పాల్మాకుల వద్ద పీ–వన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి

శంషాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. రూ. కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది. శంషాబాద్‌ మండలం.. పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 87లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పది సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందులోని కొంత స్థలం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాలకు కేటాయించారు. ఇదే సమయంలో బెంగళూరు జాతీయ రహదారి– ఔటర్‌ రింగు రోడ్డు అనుసంధానం కోసం కొత్తగా పీ–వన్‌ రోడ్డు ఏర్పాటు చేశారు.

ఈ రహదారి ఇదే సర్వే నంబరులోని భూముల నుంచి వెళ్లింది. రోడ్డుకు రెండు వైపులా దాదాపు రెండెకరాల భూమి మిగిలిపోయింది. దక్షిణం వైపు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాలను నిర్మించగా.. కొంత ఖాళీ స్థలం మిగిలింది. ఇక పీ–వన్‌ రోడ్డుకు ఉత్తరం వైపున సుమారు 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండిపోయింది. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న పట్టా భూముల యజమానులు ప్రభుత్వ భూమిని తమ పొలంలో కలిపేసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిని పట్టా భూముల్లో కలిపేసి ఇతరులకు విక్రయించారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
  
విలువైన భూముల రక్షణ ఇంతేనా? 
శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగు రోడ్డు ఏర్పాటుతో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పాల్మాకులలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి పక్క నుంచే నాలుగు వరసల పీ–వన్‌ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎకరం పొలం సుమారు రూ.కోటిన్నర వరకు ధర పలుకుతోంది. సర్వే నంబరు 87లో దాదాపు రెండు ఎకరాలు కబ్జాకు గురి కాగా.. ఈ భూములను ఆధీనంలోకి తీసుకున్న కొందరు ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు