40 మంది కాదు.. 18 మందే మృతి

28 Feb, 2018 01:55 IST|Sakshi

శిశుగృహాల్లో మరణాలపై హైకోర్టుకు సర్కార్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 18 మరణాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీరంతా చెత్తకుండీల్లో, మార్కెట్ల వద్ద దొరికిన శిశువులని, దొరికే సమయానికే వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, శక్తి వంచన లేకుండా డాక్టర్లు ప్రయత్నించినా వీరి ప్రాణాలను కాపాడలేకపోయారని తెలిపింది. ఇలా జరిగిన మరణాలే తప్ప, నిర్లక్ష్యం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల శిశు గృహాల్లో ఏ ఒక్క శిశువూ మరణించలేదని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయింది వాస్తవమో కాదో తెలియచేయాలని ప్రభుత్వాన్ని గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఓ నివేదికను ధర్మాసనం ముందు ఉంచింది. 
 

మరిన్ని వార్తలు