‘ఏకరూపం’ అందేదెప్పుడు?

10 Sep, 2018 11:14 IST|Sakshi
సివిల్‌ డ్రెస్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కొలాం ఆశ్రమ విద్యార్థులు గిరిజన విద్యార్థులు

ఆదిలాబాద్‌రూరల్‌: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ.. హామీగానే మిగిలిపోయింది. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందించిన దాఖాలాలు కనిపించడం లేదు. వేలాది మంది విద్యార్థులు పాత దుస్తులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న 17,893 మంది విద్యార్థులు కొత్త దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఆలస్యంగా పంపిణీ.. 
బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థుల దుస్తులు ఇటీవలనే కుట్టు పూర్తయింది. గత రెండు రోజుల కిందట కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు దుస్తువులు తీసుకెళ్లగా మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ విద్యార్థుల అందించే దుస్తులు ప్రస్తుతం దర్జీల వద్ద కుట్టు దశలో ఉన్నాయి. దర్జీలకు కుట్టుకు సంబంధించిన చార్జీ కుదరకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది.

హాస్టళ్ల వారీగా విద్యార్థులు..
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా ఇందులో బాలికల వసతి గృహాలు 16 ఉండగా ఇందులో 8,272 మంది బాలికలు ఉన్నారు. 38 బాలుర వసతి గృహాల్లో 9,621 మంది బాలురు ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు 9 ఉండగా ఒకటి బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 42 మంది ఉన్నారు. బాలుర వసతి గృహాలు 8 ఉండగా ఇందులో 540 మంది విద్యార్థులు ఉన్నారు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 20 వసతి గృహాలు ఉండగా ఇందులో 3 బాలికల వసతి గృహాలు ఉండగా 510 మంది బాలికలు ఉన్నారు. 17 బాలుర వసతి గృహాలు ఉండగా 970 మంది విద్యార్థులు ఉన్నారు.

మరో నెల రోజులు పట్టే అవకాశం..
ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు దుస్తుల పంపిణీకి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్‌ నుంచి రెడీమేడ్‌ అందించనుందని, మిగితా రెండు జతల దుస్తువులను జిల్లాలోని 30 మంది దర్జీలకు కుట్టు కోసం అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జత కుట్టు కూలీకి రూ. 45 చొప్పున అందించనున్నారు.

కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు తీసుకెళ్లారు..
ఎస్సీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తులను అందజేశాం. బీసీ విద్యార్థులకు సంబంధించిన దుస్తులు కుట్టు పూర్తి అయి ఇటీవలనే తమ శాఖకు చేరుకున్నాయి. సగం మంది బీసీ వసతి గృహాల హెచ్‌డబ్ల్యూవోలు వాటిని తీసుకెళ్లారు. మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉంది. వాటిని సైతం విద్యార్థులకు అందేలా చూస్తాం. – ఆశన్న, బీసీ, ఎస్సీ, అభివృద్ధి శాఖల అధికారి, ఆదిలాబాద్‌ 

కుట్టు కోసం అందించాం
రెండు జతల దుస్తులను కమిషనరేట్‌ నుంచి రేడిమేడ్‌ అందించనున్నారు. మిగితా రెండు జతలకు సంబంధించిన క్లాత్‌ 15 రోజుల కిందటనే సరఫరా అయింది. దుస్తువులు కుట్టుడు అయిన వెంటనే ఆయా వసతి గృహాలకు పంపిణీ చేస్తాం. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. – చందన, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, ఉట్నూర్, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు