సర్కారీ స్కూళ్లు సూపర్

22 May, 2015 13:54 IST|Sakshi
సర్కారీ స్కూళ్లు సూపర్

* టెన్త్ ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన
* తొలి స్థానంలో వరంగల్, చిట్టచివరన ఆదిలాబాద్  

 
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ‘ప్రైవేటు’తో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా సర్కారీ బడుల్లోని పిల్లలు కూడా మంచి ఫలితాలు సాధించారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి 2,43,719 మంది పరీక్షలు రాయగా 2,01,013 మంది(82.47%) ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రభుత్వ పరిధిలోని అన్ని మేనేజ్‌మెంట్ల(జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, గురుకులాలు, ఎయిడెడ్) నుంచి 2,39,754 మంది పరీక్షలు రాయగా 1,97,254 మంది (82.27%) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల కంటే తామేమీ తీసిపోమని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించారు. ముఖ్యంగా తెలంగాణ గురుకుల పాఠశాలల సొసైటీ నుంచి 92.99% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం. మార్చి 25 నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఆదివారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.
 
 ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలకు మొత్తంగా 5,59,223 మంది హాజరు కాగా 4,23,033 మంది(75.64%) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,13,473 మంది కాగా 3,98,267 మంది(77.56%) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి అత్యధికంగా 91.6 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, 54.9% ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ చివరి స్థానంలో నిలిచింది. కాగా, ఇంటర్మీడియట్ తరహాలోనే పదో తరగతిలోనూ బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 76.11% ఉత్తీర్ణులు కాగా, బాలికలు 79.04% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక కొత్తగా అమలైన సీసీఈ విధానంలో భాగంగా స్కూళ్లలో 20 మార్కులకు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో దాదాపుగా విద్యార్థులందరికీ 20 మార్కులు రావడం గమనార్హం.
 
 సీసీఈ భేష్.. తగ్గిన మాస్ కాపీయింగ్
 నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో ఈసారి పరీక్షలను నిర్వహించడం వల్ల మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండాపోయిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీంతో గతంలో కంటే కొంత ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. గత ఏడాది 85.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈసారి 77.56 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 8.21 శాతం ఉత్తీర్ణత తగ్గిందని తెలిపారు. అయితే ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులు బట్టీ పట్టాల్సిన అవసరం లేకుండా, ఆలోచించి పరీక్షలు రాస్తున్నారని... దీనివల్ల విద్యార్థుల్లో సృజన, ఆలోచనా శక్తి పెరుగుతుందని కడియం వివరించారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో మరింత అవగాహన వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు