300 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ

23 Jul, 2017 02:23 IST|Sakshi
300 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ

మెగా డెయిరీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి తలసాని
సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విజయ డెయిరీని రూ. 300 కోట్లతో ఆధునీకరించి మెగా డెయిరీగా అభివృద్ధి చేయనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ప్రైవేటు డెయిరీలకు దీటుగా ఉత్పత్తులు, విక్రయాలను పెంచేందుకు విజయ డెయిరీలో వచ్చే 6 నెలల్లో కీలక మార్పులు తెస్తామన్నారు. శనివారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా, సంస్థ ఎండీ నిర్మలతో కలసి మంత్రి సమీక్ష నిర్వహించారు.

 ప్రస్తుతం హైదరాబాద్‌ లాలాపేట్‌లోని డెయిరీ కేంద్రంలో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్త్యంగల ప్లాంటు పనిచేస్తోందని, దీనికి అదనంగా మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంగల మరో ప్లాంట్‌ను ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయనున్నట్లు తలసాని వివరించారు. ఇందుకోసం షామీర్‌పేట సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లో విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రైవేటు సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు.

అధికారులు బాధ్యతగా వ్యవహరించట్లేదు...
విజయ పాలు, పాల ఉత్పత్తులకు రాష్ట్రంలో ఎంతో డిమాండ్‌ ఉందని, కానీ అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే సంస్థ పనితీరు రోజురోజుకు దిగజారిపోతుందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణాలోపంతో విక్రయాల్లో వెనుకబడిందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తున్నా ప్రైవేటు సంస్థలకంటే కూడా పాల సేకరణ, పాల ఉత్పత్తుల తయారీలో ఎంతో వెనుకబడిపోయామని అసహనం వ్యక్తం చేశారు. సంస్థ మనుగడ కోసం ముందుగా దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులను తక్షణమే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. అధికారులకు టార్గెట్లు ఇవ్వాలని, జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని సమీక్షించాలని సూచించారు.

రాజధానిలో మరో 100 ఔట్‌లెట్లు
డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న వాటికి అదనంగా 100 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు సొసైటీలను ఏర్పాటు చేయాలన్న తలసాని...ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో డెయిరీకి పాలు పోసే రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. విజయ నెయ్యికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నా ఈ సంవత్సరం అమ్మకాలు తగ్గాయని, ఇది సంస్థ మనుగడకు మంచిది కాదన్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు అవసరమైతే ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్‌కు సమానంగా ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు