గులాబీ నేతలకు ‘పంచాయతీ’ గ్రేడింగ్‌

1 Apr, 2018 11:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పకడ్బందీగా పార్టీ అధినేత కేసీఆర్‌ పావులు

పల్లెల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు

‘పంచాయతీ’ ఎన్నికల బాధ్యత శాసనసభ్యులదే..

ఎమ్మెల్యేలకు గ్రేడింగ్‌ ఇవ్వనున్న ‘స్థానిక’ ఫలితాలు

సెగ్మెంట్లలోనే మకాం వేయాలని సూచన

అధికార పార్టీ నేతలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకం 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి రావడం.. గ్రామపంచాయతీలను పెంచుతూ తీర్మానించి అసెంబ్లీ లో ఆమోదించడం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహుర్తం కుదిరినట్లు సంకేతాలు ఇస్తున్నాయి. పంచాయతీ చట్టంలో సవరణలు చేసినప్పటికీ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కొత్త గ్రామ పంచాయతీలనూ ప్రకటించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ‘పంచాయతీ’ సమరం ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో జోరందుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రం కీలకంగా మారాయి.

నెలరోజులుగా పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎన్నికలపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ గత ఫలితాలను విశ్లేషించి ఏమాత్రం తగ్గకుండా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ‘ముందస్తు’గా అప్రమత్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల   ఆధారంగానే ‘గ్రేడింగ్‌’ ఉంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. హైదరాబాద్‌ను వదిలి నియోజకవర్గాల్లో తిరగాలనీ ఇటీవల సూచించారు. సాధారణ ఎన్నికలకు ముందువస్తున్న ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేంత పగడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు సంకటంగా మారనున్నాయి. 

‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే..
సాధారణ ఎన్నికలకు ముందు వస్తున్న పంచాయతీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడింగ్‌ విధానాన్ని అమలుచేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్‌లు ఇస్తోంది. దాని ఆధారంగానే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం కావడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది.

సర్పంచ్‌లను గెలిపించుకునే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్‌.. బలం నిరూపించుకునేందుకు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలను పాత పద్ధతిలో (ప్రత్యక్ష పద్ధతి) నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పూర్వ కరీంనగర్‌ జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు ఉండగా జిల్లాల విభజన తర్వాత కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న జీపీల సంఖ్య 1022 కు తగ్గింది. ఇటీవల ప్రకటించిన కొత్త పంచాయతీలతో తిరిగి 1202కు చేరింది. వీటిలో అత్యధిక స్థానాలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధికార పార్టీ నేతలపై పడింది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ సర్పంచులే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్‌ సీరియస్‌గా ఆదేశించడం అధికార నేతల్లో ఆందోళన మొదలైంది.

‘పంచాయతీ’లో ఎక్కడెక్కడ ఆధిక్యం.. గత ఫలితాల విశ్లేషణలో నేతలు
2013లో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చిపెట్టాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రజాప్రతినిధులు గత సర్పంచ్‌ ఎన్నికల విశ్లేషణలో పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గస్థాయి నేతలూ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో కూడిన ఈ రెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 12 నియోజకవర్గాలకు ఐదుచోట్ల అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ, నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నాయి.

మంథనిలో మాత్రం శ్రీధర్‌బాబు అప్పుడు మంత్రిగా ఉండడంతో  122 పంచాయతీలకుగాను 83 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. 19 చోట్ల టీఆర్‌ఎస్, 20 చోట్ల టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు, ఇతరులు గెలిచారు. జగిత్యాలలో 80 పంచాయతీలకు 39 కాంగ్రెస్, 18 టీడీపీ, కేవలం 4మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పోలిస్తే కోరుట్లలో మొత్తం 69 స్థానాలకు 26 కాంగ్రెస్, 23 టీఆర్‌ఎస్, మానకొండూరులో 122 జీపీలకు 38స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల టీఆర్‌ఎస్, చొప్పదండిలో 118 జీపీలకు 34కాంగ్రెస్, 23 టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. హుజూరాబాద్‌లో 92 జీపీలకు టీఆర్‌ఎస్‌ 53, కాంగ్రెస్‌ 11 చోట్ల గెలుపొందింది. అక్కడ 21మంది స్వతంత్రులు గెలిచారు. సిరిసిల్లలో 92జీపీలకు టీఆర్‌ఎస్‌ 45, కాంగ్రెస్‌ 19 చోట్ల గెలిచాయి. 14 మంది స్వతంత్రులు, 8 మంది వైఎస్‌ఆర్‌ సీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ బలపరచినవారు విజయం సాధించారు.

హుస్నాబాద్‌లో 122 జీపీలకు టీఆర్‌ఎస్‌ 62, కాంగ్రెస్‌ 21 గెలుచుకున్నాయి. మిగతా చోట్ల సీపీఐ, ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ధర్మపురిలో 129జీపీలకు 51 టీఆర్‌ఎస్, 42చోట్ల కాంగ్రెస్‌ గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, టీడీపీ, ఇతరపార్టీలు గెలిచాయి. వేములవాడలో 109 జీపీలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తలా24 గెలిచాయి. పెద్దపల్లిలో 102 జీపీలకు టీడీపీ అత్యధికంగా 31 గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ 24, కాంగ్రెస్‌ 20చోట్ల గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు గెలిచాయి. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫలితాలు తారుమారై చాలామంది స్వతంత్రులు, ఇతర పార్టీల సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.  

మరిన్ని వార్తలు