ఏం కష్టమొచ్చె దేవుడా..

11 Apr, 2018 12:46 IST|Sakshi
నవాబుపేట మండలం దయపంతులపల్లిలో నేలవాలిన వరిని పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి

అన్నదాతలపై వరుణుడి కన్నెర్ర

అకాల వడగండ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం

కల్లాల్లోనే తడిసి ముద్దవుతున్న ధాన్యం

తడిస్తే తీసుకునేందుకునిరాకరిస్తున్న మార్కెటింగ్‌ శాఖ

తేమ 14 శాతం లోపు ఉంటేనే కొనుగోళ్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అన్నదాతకు కొత్త కష్టం వచ్చి పడింది. ఆకస్మాత్తుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతున్నాయి. నోటిదాకా వచ్చిన ముద్ద మట్టి పాలవుతోందనే బాధ ఒకవైపు... తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ససేమిరా అనడం మరోవైపు.. ఇలా రెండు విధానాలుగా కష్టమే ఎదురుకావడంతో ఏం చేయాలో తోచన వరి సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో జిల్లాలో మూడో వంతు పంట నేలపాలైంది. ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరగడంతో బాధిత రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మాత్రం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడమే తమ బాధ్యత అని.. పరిహారానికి సంబంధించి తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు  నిరాకరిస్తుండడం అన్నదాతను ఆవేదనకుగురి చేస్తోంది. మొత్తంగా కాలం కాని కాలం.. వరుణుడి కన్నెర్రతో సమస్యల సుడిగుండలో చిక్కుకున్న పాలమూరు రైతన్నలు ఏం చేయాలో దిక్కుతోచక స్థితి ఎదుర్కొంటున్నాలు. నిబంధనల విషయంలో సడలింపు, నష్టపరిహారం పంపిణీలో ప్రభుత్వం నిర్ణయంతో కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.  

మూడో వంతు నేలపాలు...
క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా ఇటీవల కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని 26 మండలాలకు గాను 20 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాగైన పంటలో దాదాపు మూడో వంతు పూర్తిగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలే పేర్కొంటున్నాయి. జిల్లాలో 46వేల ఎకరాల్లో వరి పంట సాగవగా.. ఇటీవలి వడగండ్ల వానకు 15,123 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జిల్లాలోని మొత్తం 206 గ్రామాల్లో 8,428 మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలింది. తద్వారా జిల్లా రైతాంగానికి రూ.8.16 కోట్ల పంట నష్టం వాటినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 2,699 ఎకరాలు, మద్దూరు మండలంలో 2,125 ఎకరాలు, గండేడ్‌ మండలంలో 2,054 ఎకరాల చొప్పున రైతులు పంట నష్టపోయారు. 

మార్కెట్‌కు వస్తున్న ధాన్యం
యాసంగి సీజన్‌ సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడే మార్కెట్‌ వస్తోంది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి చాలా వరకు కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొన్నిచోట్ల ఎండిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చినా అకాల వర్షాలతో తడిసిపోతుంది. దేవరకద్ర మార్కెట్‌కు సోమవారం తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అప్పటికప్పుడు కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల మేరకు తేమ 14శాతం కంటే తక్కువగా ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 2,489 క్వింటాళ్ల హంస, 3,635 క్వింటాళ్ల సోనమసూరి రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.  

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇందుకు గాను రూ. 40 వేల పెట్టుబడి పెట్టాను. వారం రోజుల నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో 50 శాతం ధాన్యం నేలరాలింది. దీంతో నాకు రూ. 80 వేల వరకు నష్టం వట్టిలింది. ఈ విషయాన్ని గమనించి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి మాలాంటి వారిని ఆదుకోవాలి.   – టంకర్‌ శ్రీనివాస్, మరికల్‌

మరిన్ని వార్తలు