ప్యాడీ క్లీనర్లు లేనట్లే!

25 Sep, 2018 11:18 IST|Sakshi

‘‘కడ్తా పేరుతో తూకంలో కోతకు అడ్డుకట్ట వేసేందుకు ఖరీఫ్‌ కొనుగోలు సీజను నాటికి జిల్లాలో 90 అధునాతన ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. సహకార సంఘా ల ద్వారా 50, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 40 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. ముందుగా ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచుతాం ’’ ఇదీ గత రబీ కొనుగోలు సీజనులో రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అడ్డగోలు దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు గత మే నెలలో తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ఖరీఫ్‌ కొనుగోలు సీజనులో కూడా మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: గత సీజనులో రైస్‌మి ల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కోత’ పేరిట భారీగా దండుకుంటున్నారు. తాలు పేరుతో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తూకంలో కోత విధించారు. జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లకు వత్తాసు పలకడంతో కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు యథేచ్చగా కొనసాగాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కూలీలు అవసరం లేని అధునాతన ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసి ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెడతామని అధికారులు ప్రకటించారు. కానీ వీటిని తెప్పించడంలో విఫలమయ్యారు.

కొనుగోళ్లకు ఏర్పాట్లు.. 
అక్టోబర్‌ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం రాక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా రు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా వరి కోతలు జరిగే కో టగిరి, వర్ని, బాన్సువాడ, బోధన్‌ తదితర ప్రాం తాల్లో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గన్నీ బ్యాగులు, ధాన్యం రవాణా ఏర్పాట్లను వెంట వెంటనే పూర్తి చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.

తేమ పేరుతో.. 
ఈసారి మాయిశ్చర్‌ (తేమ) పేరుతో రైతులను నిండా ముంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీ) నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం వరకు అనుమతి ఉంటుంది. అయితే, గత ఏడాది ఖరీఫ్‌ కొనుగోలు సీజనులో ఈ తేమ శాతాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున దోపిడీకి తెర లేపారు. తూకం లో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు కోత విధించి రైతులను నిండా ముంచారు. పీఏసీ ఎస్‌ చైర్మన్ల కనుసన్నల్లోనే ఈ కొనుగోలు కేంద్రా లు నడిచాయి. రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కైన ఈ కేం ద్రాల నిర్వాహకులు కడ్తా పేరుతో దోపిడీకి తెర లేపారు. సీజను మొత్తానికి రూ.కోట్లలో రైతులు నష్టపోయారు. ఈసారి తేమ పేరుతో దోపిడీ జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం కట్టడి చే యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి గత సీజన్ల మాదిరి గానే రైస్‌మిల్లర్లకు వత్తాసు పలికితే ఈసారి కూడా ధాన్యం రైతులు నిండా మునగడం ఖాయం.

రబీ సీజన్‌ నాటికి అందుబాటులోకి తెస్తాం 
ఈ సీజను నాటికే ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. వీటి అవసరం ఇప్పుడు అంతగా ఉండదు. వచ్చే రబీ సీజన్‌ నాటికి వీటిని అందుబాటులో ఉంచుతాం. వీటి అవసరం రబీ సీజన్‌లోనే ఎక్కువగా ఉంటుంది. – హరికృష్ణ, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం   

మరిన్ని వార్తలు