కల్లాల కష్టాలు!

30 Apr, 2018 07:35 IST|Sakshi
బలభద్రాయపల్లిలో పొలంలోనే వరిధాన్యాన్ని ఆరబెట్టిన రైతు

రోడ్లు, పొలాల్లో ధాన్యం ఆరబెడుతున్న రైతులు

ఉపాధి హామీ పథకంలో  కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు 

రైతులకు అవగాహన కల్పించడంలో  అధికారులు విçఫలం

కోస్గి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇతర పంటలను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఏ మాత్రం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి సరైన సదుపాయం కల్పించడంలేదు. అకాల వర్షాలు కురిసి మార్కెట్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయిన ఘటనలు అనేకం. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద, సమీపంలోని రోడ్లపై కవర్లు వేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను కూడా రైతులు కాపాడుకోలేకపోతున్నారు. 
ఉపాధిహమీలో కల్లాల నిర్మాణం! 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ప్రభుత్వం కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించినా ఈజీఎస్‌ అధికారులు రైతులకు కల్లాల నిర్మాణాలపై అవగాహన కల్పించలేకపోవడంతో కల్లాలు నిర్మాణాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఉపాధిహామీ పథకంలో పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణంతో పాటు కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నా రైతులకు మాత్రం అధికారులు ఈ విషయం చెప్పడంలేదు. రైతులు కల్లాల నిర్మాణం ఆర్థిక సమస్యతో కూడుకోవడంతో సొంతఖర్చులు పెట్టి నిర్మించుకోలేని పరిస్థితి. అధికారులు కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పిస్తే వారు కల్లాలు నిర్మించుకోవడానికి ముందుకొవచ్చే అవకాశం ఉంది. 

ఎవరు చెప్పలేదు 
అధికారులు కల్లాల నిర్మాణాల గురించి ఇంతవరకు చెప్పకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఎండబెట్టుకుంటున్నాను. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రొత్సహిస్తే ఎంతోమంది పేద రైతులకు లబ్ది చేకూరుతుంది. ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు