రెండ్రోజుల్లోగా ధాన్యం డబ్బులివ్వాలి

15 Oct, 2016 03:17 IST|Sakshi
రెండ్రోజుల్లోగా ధాన్యం డబ్బులివ్వాలి

నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి
ఖరీఫ్‌లో 30 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం
{Vేడ్-1 రకానికి రూ.1,510.. గ్రేడ్-2 రకానికి రూ.1,470
ధాన్యం సేకరణ విధివిధానాలు ఖరారు
సీఎంఆర్‌కు మిల్లర్లు 25 శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే
కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తే మిల్లర్లపై క్రిమినల్ కేసులు

 

సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 2016-17 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో కనీసం 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి సేకరించనున్నారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు 48 గంటల్లోగా డబ్బులు చెల్లించాలని, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు (జీవో 40) జారీ చేసింది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా... ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం సేకరణ వరకే నిబంధనలు ఖరారు చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు పరిమితి ఏమీ లేదని, ఎంత ధాన్యం వస్తే అంతా కొనుగోలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రేడ్-1 రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,510, సాధారణ రకానికి రూ.1,470 కనీస మద్దతు ధర చెల్లించాలని ఆదేశించింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కొనుగోలు కేంద్రాల కోసం ప్రాంతాల గుర్తింపు, ఏర్పాటు బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పజెప్పారు.

ప్రతీ కేంద్రంలో ధాన్యం కొనుగోలును ధ్రువీకరించడానికి డిప్యూటీ తహశీల్దారు ర్యాంకుకు తక్కువ కానీ అధికారిని నియమించాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలతో డీఆర్‌డీఏ పీడీ, డీసీవో అవగాహనా ఒప్పందం  కుదుర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధాన్యం నాణ్యతా పరీక్షలను సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ అధికారులు చేపట్టాలని, ప్రమాణాలకు అనుగుణంగా లేని ధాన్యం సేకరించిన కొనుగోలు కేంద్రం ఇన్ చార్జిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
 
బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి..
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కస్టమ్ మిల్లింగ్‌కే కేటాయించనున్నారు. మిల్లు సామర్థ్యాన్ని బట్టే ధాన్యం కేటాయించనున్నారు. ఇప్పటికే సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) చెల్లింపుల్లో ఎగవేతదారులుగా గుర్తించిన మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. సీఎంఆర్ కోసం మిల్లుకు కేటాయిస్తున్న ధాన్యం విలువలో కనీసం 25% మొత్తానికి మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడం తప్పనిసరి చేసింది. సీఎంఆర్ విషయంలో కార్పొరేషన్.. మిల్లర్లతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించింది.

 సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యాన్ని ఇతర అవసరాలకు తరలిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఒప్పం దంలో రాసుకోవాలని సూచించింది. ము ఖ్యంగా సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యా న్ని బ్యాంకుల్లో తనఖా పెట్టడానికి వీల్లేదని, అలా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్వర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల పచ్చి బియ్యం, 68 కిలోల బాయిల్డ్ రైస్ (ఔట్‌టర్న్) ఇవ్వాల్సిందేనని నిబంధనల్లో పేర్కొంది. నిర్ణీత గడువులోగా సీఎంఆర్ చెల్లింపులు జరపకుంటే తెలంగాణ రైస్ (కస్టమ్ మిల్లింగ్)-2015 ఉత్తర్వుల కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని వార్తలు