మిల్లుల్లోనే లారీలు

3 May, 2019 11:06 IST|Sakshi

ఇందూరు/ఇందల్‌వాయి: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలున్నప్పటీకీ... మార్కెట్‌లో ఏర్పడిన హమాలీల కొరత కారణంగా మిల్లర్లు లారీల్లోంచి బస్తాలను దింపుకోవడం లేదు. నాలుగైదు రోజులుగా ఆయా మిల్లుల్లోనే లారీలు ఉండిపోవడంతో తూకం వేసి ఉంచిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపైనే ఉన్నాయి. లారీల సమస్యతో కొన్ని చోట్ల కొనుగోళ్లు కూడా చేపట్టడం లేదు. ఇటు మారుతున్న వాతావరణ పరిస్థితులతో వర్షం పడితే ఏం చేయాలో అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీ సీజన్‌కు గాను 3 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్‌ 

సప్లయి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 291 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ధాన్యం సేకరణ సాగుతోంది. ఇప్పటి వరకు 2లక్షల 10వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతుల నుంచి సేకరించిన ధాన్యం లారీల్లో తరలించడానికి దాదాపు 450 లారీలు ఏర్పాటు చేశారు. అదనంగా మరికొన్ని లారీలను పక్క జిల్లాల నుంచి తెప్పించారు. జిల్లా వ్యాప్తంగా 64 మిల్లులకు సీఎంఆర్‌ బాధ్యతలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో బస్తాలను నింపుకుని నేరుగా మిల్లులకు పంపిస్తున్నారు.

అయితే కొనుగోలు కేంద్రాల్లో ప్రయివేటు కూలీలకు తూకం వేసి లారీల్లో ఎక్కించినందుకు గాను ఒక క్వింటాలుకు రూ.25 వరకు లభిస్తోంది. అదే రైస్‌ మిల్లుల్లో లారీల్లోంచి బస్తాలను దింపినందుకు గాను కేవలం రూ.6 వరకే మిల్లర్లు ఇస్తున్నారు. దీంతో అధికంగా కూలీ వస్తున్న కొనుగోలు కేంద్రాల వైపే కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మిల్లులకు చేరిన లారీల్లోంచి ధాన్యం దింపేవారు కరువయ్యారు. ఐదారు మంది హమాలీలతోనే రోజుకు రెండు లారీల వరకు దింపుకుంటున్నారు.

అన్‌లోడింగ్‌ సమస్య ఏర్పడడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 380 వరకు లారీలు మిల్లుల్లోనే ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడానికి లారీల కొరత ఏర్పడుతుందని, వెంట వెంటనే లారీలను అన్‌లోడ్‌ చేసి పంపాలని మిల్లర్లకు పదే పదే సూచిస్తున్నా పరిస్థితి అంతే ఉంది. మరోపక్క రైతులేమో లారీల కోసం, కాంటాల ఏర్పాటు కోసం జిల్లాలో ఎక్కడో ఒక చోట రోడ్డెక్కుతూనే ఉన్నారు.

డీటీలను రంగంలోకి దింపిన జేసీ
సివిల్‌ సప్లయి అధికారులు మిలర్లకు ఎన్నిసార్లు చెప్పినా అన్‌లోడ్‌ చేసి లారీలను పంపకపోవడంతో జేసీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జేసీ ఐదుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్లను రంగంలోకి దింపారు. ఏయే మిల్లుల్లో అన్‌లోడింగ్‌ కావడం లేదో తెలుసుకుని ప్రతి గంటకు సమాచారం అందించడానికి ప్రత్యేకంగా వీరిని నియమించారు. రోజుకు 20 మిల్లులు తిరిగి వచ్చిన లారీలను అన్‌లోడింగ్‌ చేయించి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. అన్‌లోడింగ్‌ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న మిల్లుల సమాచారం ఇవ్వాలన్నారు. దీంతో రెండు రోజులుగా టీడీలు ప్రధానంగా నగర శివార్లలో ఉన్న మిల్లులను తిరుగుతున్నారు. 
ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం.. – హరికృష్ణ, డీఎం, సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌

జిల్లాలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తోంది. తూకం వేసిన బస్తాలను వెంటనే సంబంధిత మిల్లులకు లారీల ద్వారా పంపుతున్నాం. కానీ మిల్లర్లు బస్తాలను దింపుకోకపోవడంతో లారీల కొరత ఏర్పడుతోంది. వెంటనే అన్‌లోడ్‌ చేసి పంపితే లారీలతో ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని చక్కబెడుతున్నాం.

ఐదు రోజులవుతున్నా లారీలు రావడం లేదు
300 బస్తాల ధాన్యం అమ్మి ఐదు రోజులవుతున్నా లారీ రావడం లేదు. దీంతో పట్టాల కిరాయి అదనంగా భరించాల్సి వస్తుంది. మొదట్లో గన్నీ బస్తాల కొరత ఉంటే ఇప్పుడు లారీల కొరత అంటున్నారు. వర్ష సూచన ఉన్నందున లారీల కొరత తీర్చి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –జమీల్‌ పాషా, రైతు, సిర్నాపల్లి

కడ్తాతో పాటు ధర తక్కువ అంటున్నారు
నేను నల్లవెల్లి కొనుగోలు కేంద్రంలో 120 బస్తాల ధాన్యాన్ని ఎగబోసి శుధ్ధిచేసి విక్రయించాను. ధాన్యం మిల్లుకు చేరాక ఇప్పుడు తాలు గింజలు ఉన్నాయని 3 కిలోల కడ్తా, సన్నగా ఉందని కామన్‌ గ్రేడ్‌ ధర రూ. 1750 ఇస్తామని అంటున్నారు. ఈ లెక్కన మాకు 3 వేల రూపాయల నష్టం వస్తుంది. ఇకనైనా అధికారులు ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలి.     –గోపాల్‌ రెడ్డి, నల్లవెల్లి

లారీల కొరత
గన్నీ బస్తాలు లేక ధాన్యం కుప్పబోసిన వారం రోజులకు కాంట అయ్యాయి. ఇప్పుడు లారీలు లేక మరో వారం రోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది. తీరా మిల్లుకు తరలిన ధాన్యంలో మరెన్ని లోపాలు ఎత్తి చూపిస్తారోనన్న భయం ఉంది. ఇవ్వన్ని పూర్తయినా డబ్బుల కోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి కొనుగోళ్ల వేగవంతానికి కృషి చేయాలి. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి 

మరిన్ని వార్తలు