నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు..

10 Oct, 2018 09:23 IST|Sakshi
ధాన్యం కొనుగోలు చేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

జిల్లాలో బుధవారం ఖరీఫ్‌ సీజన్‌ వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మా ర్కెట్‌ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఇందుకో సం జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 63, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 50కేంద్రాలు ఉన్నాయి. కాగా ఈసీజన్‌కు గాను 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 

సాక్షి, భువనగిరి : ఖరీఫ్‌ సీజన్‌ వరిధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. మొదట  రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సీజన్‌కుగాను 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 63, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 50 కేంద్రాలు ఉన్నాయి. రబీ సీజన్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు సన్నాహాలు
జిల్లాలో సాధారణ విస్తీర్ణం 34,066 హెక్టార్లు కాగా ప్రస్తుత సాగు విస్తీర్ణం 42,770 హెక్టార్లు ఇందులో మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో ఖరీఫ్‌ సీజన్‌కు గానూ 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరణ అంచనాతో అధికారులు ముందుకు సాగుతున్నారు. మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం కొంత వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. ప్రస్తుతం మూసీ ఆయకట్టుతో పాటు చిన్న నీటి పారుదల కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి ధాన్యం రావడానికి కొంత సమయం పట్టనుంది. అయితే మూసీ పరీవాహకేత ర ప్రాంతాల్లో ముందుగా సాగు చేయడంతో ఇప్పటికే వరికోతలు మొదలై ధాన్యం విక్రయాలు కూడా ప్రారంభించారు.
 
పెరిగిన మద్ధతు ధర..
కేంద్ర ప్రభుత్వం ఈసారి మద్ధతు ధరను పెంచడంతో కొంత వరకు రైతులలో ఆశ కలిగింది.ధాన్యానికి క్వింటాకు ఏ–గ్రేడ్‌ రూ.1,770, బీ–గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,750 చొప్పున పెంచారు. గతంతో పోల్చుకుంటే ఏ–గ్రేడ్‌కు రూ.180, బీ–గ్రేడ్‌కు 200 చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికను రూపొందించారు. ఖరీఫ్‌సీజన్‌కు గానూ 33.75 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 33.59 లక్షల గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు టార్పాలిన్‌లు, ప్యాడీక్లీనర్లు సిద్ధంగా ఉంచారు.  

ఏర్పాట్లు పూర్తి 
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. బుధవారం కాకుంటే గురువారమైనా వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. హమాలీలు అందుబాటులో ఉంటే ఇదేరోజు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  – సంధ్యారాణి, డీఎస్‌ఓ

మద్ధతు ధర పెరిగింది 
ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రిని సిద్ధంగా ఉంచాం. ఈసారి వరి ధాన్యానికి మద్ధతు ధర పెరిగింది. పెరిగిన మద్ధతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పెరిగిన మద్ధతు ధర గురించి రైతులకు తెలియజేస్తాం. – సారిక, మార్కెట్‌ శాఖ జిల్లా అధికారి  

మరిన్ని వార్తలు