సేకరణ లక్ష్యం

17 Oct, 2018 11:12 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ ముండ్రాతి  హరిత, జేసీ మహేందర్‌ రెడ్డి  అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

జిల్లాలో 102 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్‌–67, ఐకేపీ–33, జీజేసీ–2 ఏర్పాటు చేయనున్నారు. ఖరీఫ్‌లో 20 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దిగుబడి  దాదాపు 1.35 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకం రూ.1,750 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష టన్నులు కొనుగోలు లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

రెండు రోజుల్లోనే డబ్బులు...
గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటలను విక్రయించేవారు. ప్రభుత్వం గత విధానాలకు స్వస్తి పలుకుతూ రెండు, మూడు రోజుల్లోనే అన్నదాతలకు డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు చేసే మహిళా సంఘాలకు  ట్యాబ్‌లు అందజేసి, కొనుగోళ్లు ఏ విధంగా చేయాలి, వివరాల క్రోడీకరణ, బ్యాంకు ఖతాల సేకరణ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో కేంద్రాల్లో పంటను విక్రయించిన అన్నదాతల వివరాలను ఖాతాల్లో నిక్షిప్తం చేశారు. లాగిన్‌లో రైతు వివరాలు పొందుపర్చిన తర్వాత పౌరసరఫరాల సంస్థకు వివరాలను అందజేస్తారు. అనంతరం డీఎం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

26.50 లక్షల గన్నీ బ్యాగులు 
ఈ సారి 26.50 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచబోతున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే 9.50 లక్షల బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేందుకు తూకం మిషన్లు, గన్నీ బ్యాగుల కోసం ఐదుగురు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.17 లక్షల బ్యాగులు ఇంకా రావాల్సి ఉంది.

ఆరబెట్టి తీసుకురావాలి..
రైతులు పంట పొలం నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా ఆరబెట్టి తీసుకురావాలి. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా తీసుకరావాలని అధికారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టకుండ తమ పొలాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకరావాలని అధికారులు సూచిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నాం..
నవంబర్‌ మొదటి వారం నుంచి పంట చేతి కొస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి రెండు రోజుల్లోనే డబ్బులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయరు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రైతులకు నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు వస్తాయి. –వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌  

మరిన్ని వార్తలు