ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

24 Apr, 2019 07:42 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గ్రేడ్‌ను బట్టి రేటును నిర్ణయించారు. రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనాలని భావించినా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా కావడంతో అధికారులు వద్దని చెప్పినా వినకుండా రైతులు రబీలో వరి సాగు చేశారు. తీరా సాగునీరు సరిపోక చాలాచోట్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, పంట కోతదశలో ఉన్న సమయంలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటను తీస్తే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది.
  
రబీలో 11,993 హెక్టార్లలో సాగు  
జిల్లాలో ఈ రబీలో 11,923 హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంటను సాగు చేశారు. ఎత్తిపోతల పథకాల     ద్వారా చెరువులు నింపడం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందింది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నియోజకవర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కాల్వల ద్వారా చెరువులోకి నీటిని విడుదల చేశారు. కాల్వలకు సమీపంలో వ్యవసాయ భూములు కలిగిన రైతులు మోటార్ల ద్వారా వరి పంటకు సాగు నీటిని అందించారు. బోరుబావుల కింద కూడా వరి పంటలను సాగు చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 61 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఐకేపీ ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్‌ల ద్వారా 41 కేంద్రాలను  ఏర్పాటు చేసి 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ప్రభుత్వం ఏ–గ్రేడ్‌ రకం వరి ధాన్యానికి రూ.1,770, బీ–గ్రేడ్‌ రకం ధాన్యానికి రూ.1,750 మద్దతు ధరగా నిర్ణయించింది. దానితో పాటు అనేక నిబంధనలు విధించింది. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ధాన్యం విక్రయించాలంటే నిబంధనలు పాటించాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం నాణ్యతగా ఉండటంతో పాటు 17శాతం కంటే తక్కువ తేమ ఉండాలని తప్పనిసరిగా ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే 61 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు కేవలం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో గంట్రావ్‌పల్లి, లక్నారంలో, మెప్మా ఆధ్వర్యంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో మాత్రమే ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే నాలుగు రోజులుగా కోత దశలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు. ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టేందుకు కూడా భయపడుతున్నారు. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో, ఎక్కువగా పంటలు ఉన్న ఊర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.

అక్రమాలకు జియో ట్యాగింగ్‌తో చెక్‌ 
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు జియోట్యాగింగ్‌ను వినియోగించుకుంటున్నారు. కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అనధికారికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా రైసు మిల్లులకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్‌ విధానాన్ని అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల అధికారులు తమ కార్యాలయాల నుంచే ధాన్యం కొనుగోలు తీరును పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. జియో ట్యాగింగ్‌ అమలు వల్ల కేంద్రాల్లో దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి వరి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి రైతులకు లబ్ధి చేకూర్చవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. 

అవసరానికి అనుగుణంగా కేంద్రాలు  
పంట పొలాల నుంచి వస్తున్న ధాన్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో మొత్తం 61 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మరికొన్ని కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు, టార్ఫలిన్‌లు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించాలి. కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలనుకున్న రైతులు తమ వెంట పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్‌లను తీసుకురావాలి.  – మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  

సింగిల్‌విండో ద్వారా కొనుగోలు చేస్తామన్నారు 
చాలా ఏండ్ల నుండి తెల్కపల్లిలో సింగిల్‌విండో ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెల్కపల్లిలో కొనుగోలు చేయలేదు. ప్రతి ఏడాది నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి వడ్లు అమ్ముకుంటాం. మా ఊరి నుండి ఇక్కడి వరిధాన్యాన్ని తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది.  –  వెంకట్‌రెడ్డి, రైతు, గడ్డంపల్లి, తెలకపల్లి  

మరిన్ని వార్తలు