ఆదర్శం.. నక్కవానికుంట తండా

5 Jan, 2019 08:21 IST|Sakshi
పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయడంపై చర్చిస్తున్న గ్రామస్తులు

సర్పంచ్, పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం

అభ్యర్థుల పేర్లూ వెల్లడి

కోయిల్‌కొండ (నారాయణపేట): మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని నక్కవాని కుంట తండా కొద్దినెలల క్రితం గ్రామపంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయింది. ఈ మేరకు ఎన్నికలు రావడంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకునే పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10లక్షలు అందజేయనున్నారన్న విషయం తండా పంచాయతీ వాసులకు తెలిసింది. ఇంకేం.. పంచాయతీ కార్యవర్గాని ఏకగ్రీవం చేసుకుందామని నిర్ణయించి, సర్పంచ్, వార్డు సభ్యులపేర్లను  కూడా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
 
770 మంది జనాభా.. 462 మందిఓటర్లు 
కోయిల్‌కొండ మండలంలో గ్రామపంచాయతీగా మారిన నక్కవాని కుంట తండాలో 770 జనాభా, 462 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు జీపీని 8 వార్డులుగా విభజించారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి మాజీ సర్పంచ్‌ రాజునాయక్‌ అధ్యక్షతన తండా వాసులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ మేరకు సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సర్పంచ్‌ అభ్యర్థిగా డి.రాందాస్, ఉపసర్పంచ్‌గా ముడావత్‌ బాలునాయక్, వార్డు సభ్యులుగా హరిచన్, రుక్కమ్మ, బి.చంద్రమ్మ, శాంతమ్మ, బాలునాయక్, లక్ష్మీబాయి, ధారాసింగ్, హూమ్లానాయక్‌ పేర్లను 1నుంచి 8వ వార్డులకు నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయితీలో పోటీ జరగకుండా తండా ప్రజలందరూ ముందుకొచ్చి ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ సర్పంచ్‌ రాజునాయక్, స్థానికులు బాల్‌రాంనాయక్, హరినాథ్, మోహన్, ధారాసింగ్‌స్వామి, రాందాస్, బాబునాయక్, సక్రునాయక్, గౌడనాయక్‌ తెలిపారు.  

గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. 
సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నిత్యం తండాలోనే ఉంటూ స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రభుత్వం నుంచి అందే నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.  – డి.రాందాస్, సర్పంచ్‌ అభ్యర్థి 

తండాలకు వరం.. 
కొత్త గ్రామపంచాయితీలుగా తండాలు ఏర్పాటు కావడం ఒక వరం. గతంలో మా తండాలను ఎవ్వరు పట్టించుకునే వారే కారు. ఇప్పుడు మా తండాలు పంచాయితీలు మారడంతో నేరుగా నిధుల వస్తాయి. ఈ నిధులతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. – బాలునాయక్, ఉపసర్పంచ్‌ అభ్యర్థి 

గతంలో నిధులు రాలేదు.. 
గిరిజన తండా కావడంతో గత ఉమ్మడి గ్రామపంచాయితీలో ఎక్కువ నిధులు వచ్చేవి కావు. ఎక్కువగా గ్రామానికే వెళ్లేవి. కొత్తగా గ్రామపంచాయితీ ఏర్పడడంతో ఈసారి మా తండా ను అభివృద్ధి చేసుకునే అవకాశం మాకే లభించింది. – రాజునాయక్, మాజీ సర్పంచ్‌

మరిన్ని వార్తలు