పోరుకు సన్నద్ధం

6 Jun, 2018 13:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వనపర్తి : గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లను గుర్తించడం, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలు నమోదు చేసుకోవడం, జిల్లాలోని 14 మండలాలను మూడు విభాగాలుగా విభజించడం వంటి ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,438 వార్డులు ఉన్నాయి. వార్డు వారీగా ఒక పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుండడంతో 2,438 ఉండనున్నాయి. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామాల కార్యదర్శులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అనువుగా ఉన్న గదులను గుర్తించారు. వాటిలో వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణలో  ఇబ్బందులు తలెత్తకుండా ఉండే భవనాలను ఎంపికచేశారు.  

ఓటర్ల గుర్తింపు 
జిల్లాలోని 14 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించారు. మొత్తం 2,88,503 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,46,718 మంది, మహిళలు 1,41,785 మంది ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 24,369 మంది ఉండగా పురుషులు 12,162, మహిళలు 12,207 ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 49,285 మంది ఉండగా, ఇందులో పురుషులు 25,230, మహిళలు 24,052 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 1,82,788 మంది ఉన్నారు. కాగా, వీరిలో పురుషులు 92,734, మహిళలు 90,054 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు మొత్తం 32,049మంది ఉండగా>.. పురు షులు 16,578 మంది, మహిళలు 15,470 మంది ఉన్నారని రెవెన్యూ అధికారులు గుర్తించారు.  

అధికారులకు బాధ్యతలు ఇవే.. 
జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటే తగిన సిబ్బంది కావాలి. ఆర్‌ఓ స్టేజ్‌ 1 అధికారి, ఆర్‌ఓ స్టేజ్‌ 2 అధికారి, ప్రిసైడింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయం నుంచి గ్రామాల్లో ప్రకటించడం, అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడం, నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రక టించి వారికి గుర్తులు కేటాయించడం రిటర్ని ంగ్‌ అధికారి స్టేజ్‌ 1కు బాధ్యత అప్పగించారు. వీరిని ఒక్కో క్లస్టర్‌ గ్రామపంచాయతీలకు ఒక్కొక్కరి చొప్పున

మొత్తం 98మందిని ఎంపికచేశారు.  
∙ఇక స్టేజ్‌ 2 రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం  మొత్తం 286 మందిని ఎంపికచేశారు. వీరంతా పోలింగ్‌ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడం, పోలింగ్‌ తీరు, కౌంటింగ్, ఎన్నికల్లో గెలిచిన వారిని ప్రకటించడం, ఉప సర్పంచ్‌ ఎన్నికను వెంటనే పూర్తిచేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ప్రిసైడింగ్‌ అధికారి ఒకరు ఉంటారు. మొత్తం 2,583 మంది ప్రిసైడింగ్‌ అధికారులను గుర్తించారు. 2,847 మంది పోలింగ్‌ అధికారులు ఉంటారు. ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారి ఇద్దరు కలిసి ఓటు వేయడానికి వచ్చిన వారికి పూర్తిగా సహకరించాలి.   

మూడు విడతలుగా ఎన్నికలు 
∙14 మండలాలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి విడతలో వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్ద మందడి, గోపాల్‌పేట్, రేవల్లి మండలాలు ఉన్నాయి.  ∙రెండవ విడతలో కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలను చేర్చారు.  
∙మూడవ విడతలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు చేర్చినట్లు అధికారులు ప్రకటించారు. 

ఏర్పాట్లు పూర్తిచేశాం.. 
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు, అవసరమైన సిబ్బందిని గుర్తించడం వంటి పనులు పూర్తిచేశాం. జిల్లాలోని 14 మండలాలను మూడు విడతలుగా విభజించాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 
– వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి,

మరిన్ని వార్తలు