పంచాయతీ సందడి!

1 Apr, 2018 10:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోరుకు సిద్ధమవుతున్న ఆశావహులు 

సర్పంచ్‌ కుర్చీపై స్పష్టతనిచ్చిన సర్కారు

ఉప సర్పంచ్‌ సీటుకు పెరిగిన క్రేజ్‌

స్థానిక సమరంపై గ్రామాల్లో చర్చోపచర్చలు 

పల్లెల్లో పంచాయతీ సందడి మొదలైంది. స్థానిక పోరుకు సర్కారు పచ్చజెండా ఊపడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు.ప్రస్తుత  పాలకవర్గం ఆగస్టులో ముగియనున్న నేపథ్యంలో అప్ప ట్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చెక్‌ పవర్‌ విషయంలో తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో నాయకులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సమరానికి తెరలేచింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు ఆమోదముద్ర పడడంతో గ్రా మ పంచాయతీల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో ఎన్నికలకు దాదాపుగా లైన్‌ క్లియరైనట్లయింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు రెండో తేదీ నాటికి ముగి యనుండడంతో అప్పటిలోపు ఎన్నికలు జరపాలని ప్రభు త్వం భావిస్తోంది. మే నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేసి.. కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జూన్‌ నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరే అవకాశముంది.

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక సందడి నెలకొంది. సర్పంచ్‌ ఎన్నిక ప్రత్యక్షమా..? పరోక్షమా.. అనే చర్చకు ఫుల్‌స్టాప్‌ పడిన పరిస్థితుల్లో సర్పంచ్‌ పీఠంపై కన్నేసిన ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు చెక్‌పవర్‌ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పల్లెల్లో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికే చెక్‌ పవర్‌ ఉండేది. ఇకపై కార్యదర్శి స్థానే ఉపసర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయం స్థానిక సంస్థల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది.  

ఉప సర్పంచ్‌దే హవా! 
రిజర్వేషన్ల కారణంగా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల ప్రాబల్యమే ఎక్కువగా కనిపించనుంది. నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలు సర్పంచ్‌ కుర్చీ ఎక్కితే.. బలమైన సామాజికవర్గం ఉప సర్పంచ్‌ పదవిని చేజిక్కించుకుంటోంది. వార్డు సభ్యుల సంఖ్యాబలంతో ఉప సర్పంచ్‌ సీటును దక్కించుకుంటున్న సభ్యులు పంచాయతీ పాలనావ్యవహారాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల పాత్ర కూడా దాదాపుగా వీరే పోషిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్‌ కూడా కట్టబెట్టడంతో గ్రామ రాజకీయాలు సరికొత్త పుంతను తొక్కనున్నాయి. ఇప్పటికే గ్రామ రాజకీయాల్లో పలుకుబడి ప్రదర్శిస్తున్న ఉపసర్పంచ్‌ పదవి.. వచ్చేఎన్నికల నుంచి మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది.

ఈ తరుణంలో ఉప సర్పంచ్‌ సీటును కైవసం చేసుకునేందుకు పోటీ తీవ్రం కానుంది. సర్పంచ్‌ అధికారాలకు తగ్గట్టు దాదాపు అవే హక్కులు ఉపసర్పంచ్‌ కూడా ఉండే అవకాశం ఉన్నందున ఈ పదవి దక్కించుకునే విషయంలో పల్లె రాజకీయం రసవత్తరంగా మారనుంది. మరోవైపు ఇప్పటి నుంచి పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం కూడా పంచాయతీ పోరులో కీలకం కానుంది. ప్రస్తుతం ఐదేళ్లకోసారి రిజర్వేషన్‌ మారేది. దీంతో ఒకసారి గెలిచిన ప్రజాప్రతినిధులు మరోసారి తన సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ ఉండదనే భావనలో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపేవారు.  అదే సమయంలో ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే ధీమాతో గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడమేగాకుండా.. నిధులు దుర్వినియోగం కూడా గణనీయంగా ఉండేది. ఈ పరిస్థితిని విశ్లేషించిన సర్కారు.. పదేళ్లపాటు ఒకే విధమైన రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో ఒకసారి సర్పంచ్‌ గెలిచినా అభ్యర్థి మరోసారి తన అధిక్యతను ప్రదర్శించుకునేందుకు గ్రామాభివృద్ధిపై దృష్టిసారించే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రకటనపై ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే రిజర్వేషన్‌ వర్తింపజేసిన సామాజికవర్గం ఆశావహులు మాత్రం.. సర్పంచ్‌ పదవిపైగాకుండా ఉపసర్పంచ్‌ పదవిపై కన్నేశారు. ఇలా పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందే తడువు పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో బలమైన పునాది వేసుకోవాలని ఆయా రాజకీయపార్టీలు యోచిస్తున్నాయి. ఏదీఎమైనా.. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి.. బరిలో దిగేందుకు ఆశావహులు కదనకుతుహలంతో ఉన్నారు.  

మరిన్ని వార్తలు