పల్లెలకు వెలుగు

15 Apr, 2019 09:39 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పాలక వర్గాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ  పంచాయతీ పాలన పారదర్శకంగా సాగేందుకు గ్రామ స్థాయిలో ఏడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో పాలకవర్గం భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా పంచాయతీరాజ్‌ చట్టం–2018లో రూపుదిద్దుకుంది.

జిల్లాలో మొత్తం 401 పంచాయతీలకు నూతన పాలకవర్గంతో గ్రామ జ్యోతి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తెలంగా ణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ –49 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పా టు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం  ఈ కమిటీలకు సర్పంచ్‌ లేదా  ఉపసర్పంచ్‌ లేదంటే  వార్డు సభ్యులు చైర్మన్లుగా ఉంటా రు. ఆయా కమిటీల్లో ఆ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సంబంధిత రంగాల్లో అనుభవం ఉండి పదవీ విరమణ చేసినవారు సభ్యులుగా నియమితులవుతారు.

వేర్వేరుగా ఏర్పాటయ్యే ఏడు కమిటీలకు ప్రత్యేక బాధ్యతలుంటాయి. వారికి సంబంధించిన అంశాల్లో గ్రామంలో పర్యటించి పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమచారం ప్రకారం ఆయా రంగాల్లో అందుతున్న సేవలపై సమావేశంలో సమీక్షించి విశ్లేషించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజల అవసరాలు తీర్చేలా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేయాలి. దీంతో గ్రామాల సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలకు  గ్రామ స్థాయిలో సంబంధిత అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడమే.. 
గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే కీలకమైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఊరు, మన సమస్యలు, మన ఆలోచనలు, మన వనరులు, మన పరిష్కారాలు ఉండేలా పంచాయతీరాజ్‌ సంస్థలు కృషి చేయాలని లక్ష్యం.
ఇవీ కమిటీలు

  •      పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్వహణ
  •      వీధి దీపాల నిర్వహణ
  •      మొక్కలు నాటడం, సంరక్షణ
  •      గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు
  •      పారిశుద్ధ్యం–తాగునీరు
  •      ఆరోగ్యం–పోషకాహారం

 ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం..
తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లో స్టాడింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని రూపొందించారు. కమిటీల ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ది కోసం ఈ కమిటీలు ఎంతగానో దోహదపడనున్నాయి.–రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి 

మరిన్ని వార్తలు