ఖజానా కళకళ

31 Mar, 2019 11:03 IST|Sakshi
ఆదిలాబాద్‌ మండలం భీంసరి గ్రామ పంచాయతీలో పన్ను వసూలు చేస్తున్న పంచాయతీ సిబ్బంది (ఫైల్‌)

ఆదిలాబాద్‌అర్బన్‌: ఆస్తిపన్ను ఈ సారి రికార్డు స్థాయిలో వసూలైంది. పంచాయతీ ఎన్నికలు జరిపి ప్రశాంత వాతావరణంలో పన్ను వసూలు చేయడంలో పంచాయతీరాజ్‌ శాఖ సఫలమైంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఇంటి పన్ను, ఇతర పన్నులు వసూలు చేసింది. గత రెండు, మూడేళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను సైతం వసూలు చేయడంతో పంచాయతీ ఖజానా కళకళలాడుతోంది. ఉమ్మడి నాలుగు జిల్లాల పన్ను లక్ష్యం రూ.16.73 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.13.70 కోట్లు వసూలయ్యాయి. ఆస్తి పన్ను వసూళ్లలో పంచాయతీరాజ్‌ శాఖ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తోంది.

ఓవైపు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా.. నిర్ధేశిత లక్ష్య సాధనకు చేరువలో నిలవడంతోపాటు వసూళ్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.16,73,97,379 మేర పన్నుల రూపేణా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.13,70,99,238 వసూలైంది. అంటే ఆస్తి పన్ను వసూళ్లపై ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ  మేరకు సాధ్యమైందని చెప్పవచ్చు. గత రెండు, మూడేళ్లుగా బకాయిదారులు కట్టకుండా పన్ను ఎగవేస్తున్నారు. దీంతో పన్ను వసూలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పంచాయతీరాజ్‌ శాఖ అందుకు అనుగుణంగా అధికారులను, సిబ్బందిని నియమించి రావాల్సిన మొత్తాన్ని రాబడుతోంది. మరోవైపు పన్ను వసూళ్లలో ఏమాత్రం నిర్లక్ష్యంగా  
వ్యవహరించిన సహించేది లేదని.. టార్గెట్లను అధిగమించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేయడంతో టాక్సు వసూళ్లు భారీగా పెరిగాయి.

ఉమ్మడి జిల్లాలో  రూ.13.70కోట్లు వసూలు 
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13.70 కోట్ల పన్ను వసూళ్లు చేశారు. మిగతా రూ.3.02 కోట్లను మరో రెండు రోజుల్లో వసూలు చేయాల్సి ఉంది. ఇందులో ఆదిలాబాద్‌లో రూ.4.07 కోట్లు వసూలు కాగా, మిగతా రూ.98.86 లక్షలు, మంచిర్యాలలో రూ.3.95 కోట్లు రాబట్టగా, మిగతా రూ.65.06 లక్షలు, కుమురంభీంలో రూ.3.14 కోట్లు వసూలు చేయగా, ఇంకా రూ.37.80 లక్షలు రాబట్టాల్సి ఉంది. నిర్మల్‌లో రూ.2.53 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.1.01 కోట్లు మరో రెండు రోజుల్లో రాబట్టాల్సి ఉంది.
 
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి 
జిల్లాలోని పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజు పన్ను వసూళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీంతో పన్ను వసూళ్లలో వెనుకబడి పంచాయతీని ముందుకు తీసుకెళ్లడంలో పాత్ర పోషిస్తున్నారు. దీంతో 100 శాతం పన్ను వసూలైన పంచాయతీల్లోని సిబ్బందిని ఇతర పంచాయతీల్లో పన్ను వసూళ్లకు పంపిస్తున్నారు. దీంతో సిబ్బంది సైతం ఎక్కువై లక్ష్యం చేరుకునే దిశగా నడుస్తున్నారు.

దీంతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల విషయమై ఉదయం, సాయంత్రం రెండుమార్లు జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకుంటున్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన పంచాయతీలు ఎవైనా ఉంటే.. యాక్టివ్‌గా ఉన్న సిబ్బందిని అక్కడికి పంపిస్తున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లోనే ఆ పంచాయతీ లక్ష్య సాధన దిశగా అడుగులేస్తోంది. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్‌ పని చేయకపోవడం, నెట్‌వర్క్‌ సమస్య ఉండడంతో రోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన వసూళ్ల సమాచారాన్ని ఒక్కో రోజు ఆలస్యంగా జరుగుతోందని తెలుస్తోంది.

గడువు పొడిగిస్తే.. వందశాతం వసూలు
ఆదిలాబాద్‌ జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 178 గ్రామ పంచాయతీల్లో మాత్రమే 100 శాతం పన్ను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ ఒకటికల్లా సుమారు 200 పంచాయతీల్లో వందశాతం పన్ను వసూళ్లు  సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇప్పటి వరకు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 80.48 శాతం చేరుకోగా, రెండు రోజుల్లో మరో పదిశాతం సాధించేందుకు కృషి చేస్తున్నారు. గతేడాది మాదిరిగా ప్రభుత్వం ఈ ఏడాది కూడా పన్ను వసూళ్ల గడువును పక్షం రోజుల పాటు పొడిగిస్తే అటుఇటుగా ఖచ్చితంగా శతశాతం చేరుకునేందుకు చర్యలు తీసుకుంటా మని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. 

లక్ష్యాన్ని  చేరుకుంటాం.. 
పన్ను వసూళ్ల లక్ష్యాన్ని గడువులోగా చేరుకుంటాం. ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది పన్ను వసూలైంది. ఇదే వేగంతో ముందుకు వెళ్తాం. ఇప్పటికే లక్ష్యం 80 శాతం దాటింది. మిగిలిన రెండు రోజుల్లో 90 శాతం చేరుకునేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం గ్రేస్‌ పీరియడ్‌ పెంచుతుందని అనుకుంటున్నాం. గడువు పెంచితే మరింత వేగంగా పన్ను వసూలు చేసి వందశాతం సాధిస్తాం.  – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు