విరివిగా రుణాలు..!

29 Apr, 2019 09:55 IST|Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు విరివిగా అందజేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిర్ణయించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు, ఉన్నత చదువుల కోసం రైతుల బిడ్డలకు రుణాలు అందజేయనుంది. పంట రుణాలను ఇవ్వడంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీసీసీబీ ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.450 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఖరీఫ్‌లో రూ.270 కోట్లు, రబీలో రూ.180 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సుమారు రూ.20 కోట్ల మేరకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

వ్యవసాయేతర రుణాలు సైతం..
జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.40 కోట్ల వరకు రుణాలను ఇవ్వనుంది. వివిధ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల బిడ్డల ఉన్నత చదువులకు లోన్స్‌ అందజేయనుంది. ఇందుకు అన్ని పత్రాలను సమర్పించిన వారం రోజుల్లోగా విద్యా రుణాలను అందించాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి రూ.30 లక్షల వరకు రుణం ఇవ్వాలని యోచిస్తోంది. విద్యారుణాల కోసం ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గత సంవత్సరం కంటే రెట్టింపు స్థాయిలో విద్యార్థులకు రుణాలను ఇవ్వాలని భావిస్తోంది.

ఎక్స్‌ప్రెస్‌ గోల్డ్‌ లోన్‌ పథకాన్ని ప్రారంభించి గ్రాము బంగారంపై రూ.2200 వరకు తక్కువ వడ్డీతో ఆరునెలల కాలపరిమితిలో చెల్లించే విధంగా రుణాలను ఇవ్వడాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అదే విదంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 13 ఏటీఎంలతో పాటు మొబైట్‌ ఏటీఎంలు సమకూర్చుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్న జిల్లా సహకార బ్యాంకు నూతనంగా మఠంపల్లి, మునగాల, మునుగోడులో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏటీఎంల ద్వారా ప్రజలకు తమ సేవలను మరింత విస్తరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం..
2008 సంవత్సరంలో రుణమాఫీ అర్హత పొందని రైతులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించా రు. అసలు వడ్డీపై 35 శాతం తగ్గించి రుణాల ను చెల్లించే వెÐðసులుబాటును కల్పిలంచారు. జూన్‌ 30 వరకు చెల్లించే వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు బ్యాంకులో పేరుకుపోయిన వ్యవయేతర రుణాలను చెల్లించే వారికి సైతం వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం ఇవ్వనున్నా రు. రుణానికి సమానంగా వడ్డీ చెల్లించే వెసులుబాటును కూడా కల్పించి పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రికవరీ బృందాలను ఏర్పాటు చేసి వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా బకాయిలు వసూలు చేసుకునే పనిలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు.

బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి
రైతులకు విరివి గా రుణాలు ఇ వ్వాలని నిర్ణయించాం. రైతులతో పాటు ఉ ద్యోగులు, ఇతర వ్యాపారవర్గాలు తమ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అబివృద్ధికి సహకరించాలి. పంట రుణాలను ఇవ్వడంతో అన్ని బ్యాంకులకంటే తామే ముందుం టున్నాం. పేరుకుపోయిన బకాయిల కోసం వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం కల్పించాం. రుణాల ను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి దోహదపడాలి. – కె.మదన్‌మోహన్, డీసీసీబీ, సీఈఓ

మరిన్ని వార్తలు