ఢిల్లీలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

3 Jun, 2018 01:01 IST|Sakshi

      తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు

      కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

      హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి శనివారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తేజావత్, భవన్‌ ఆర్సీ అశోక్‌కుమార్, ఏఆర్సీ వేదాంతం గిరి, భవన్‌ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని, కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజామోదం పొందాయని గుర్తు చేశారు.  

రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలి.. 
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం రెండుగా ఏర్పడినా అభివృద్ధి విషయంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల్లోనూ అపారమైన సహజ వనరులు, నైపుణ్యం, కష్టపడే తత్వం ఉన్న ప్రజలు ఉన్నారని, వీటిని పరస్పరం అవగాహనతో వినియోగించుకొని అభివృద్ధి పథంలో నడవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. గవర్నర్‌ స్పందిస్తూ.. ప్రజలకు ‘మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే’అని అన్నారు. అనంతరం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలను అందరూ ఆస్వాదించారు.

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములైన తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు’అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ ప్రజలకు కూడా రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు