కల్యాణ వైభోగమే

9 Apr, 2014 03:36 IST|Sakshi
కల్యాణ వైభోగమే

భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణం
భద్రాచలం, న్యూస్‌లైన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన స్వామి వారి పెళ్లి వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా కల్యాణ వేడుకలో పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  కల్యాణోత్సవం సందర్భంగా.. మంగళవారం తెల్లవారుఝామున రెండు గంటలకే ఆలయం తలుపులు తెరిచారు. స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆలయంలో ప్రత్యేక పూజలందుకున్న ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి మంగళ వాయిద్యాలతో, వేదనాద పురస్సరంగా సకలవిధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారి మూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆశీనులను చేశారు. ముందుగా తిరువారాధన, విష్వక్సేన పూజ నిర్వహించి, ఆ తర్వాత అందరి గోత్రనామాలు జపించి చేయబోయే కల్యాణ తంతుకు ఎటువంటి విఘ్నాలు జరగకుండా కర్మణ్యే పుణ్యాహవచనం అన్న మంత్రంతో మంటపశుద్ధి చేశారు.
 
  శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టి కన్యావరణను జరిపిం చారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం చేశారు. వధూవరుల వంశ గోత్రాల ప్రవరలు ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళణం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివేదించి, సీతారాములకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పఠించారు. అనంతరం కన్యాదానంతోపాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎనిమిది శ్లోకాలతో, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకాలతో మంగళాష్టకం చదివారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లాన్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ఉంచారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాలకు  పూజ చేయించి సీతమ్మ వారికి మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఆ తర్వాత మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టారు.
స్వామి వారి కల్యాణ వేడుక, భద్రాచల క్షేత్ర మహత్మ్యం గురించి ఆలయ వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు.  కల్యాణం తిలకించిన వేళ తమ జన్మధన్యమైందంటూ ఉత్సవంలో పాల్గొన్న లక్షలాది భక్తులు ఆనంద పరవశులయ్యారు. మిథిలా స్టేడియం రామనామస్మరణతో మార్మోగింది. స్వామి వారి కల్యాణ వేడుకలో హైకోర్టు జడ్జి రవికుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దైవ జ్ఞశర్మ, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, ఆర్‌వీఎం కమీషనర్ ఉషారాణి, ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్, జేసీ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీవో దివ్య, దేవస్థానం ఈవో ఎం రఘునాథ్, ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 వేములవాడలోనూ...
 కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం పక్షాన వేములవాడ నగర పంచాయతీ కమిషనర్ త్రయంబకేశ్వర్‌రావు, ఆలయం తరఫున ఈవో కృష్ణాజీరావు దంపతులు స్వామివారలకు పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 2.50 లక్షల మంది తరలివచ్చారు. కల్యాణ ముహూర్తానికే శివపార్వతులు శివుడిని పెళ్లాడే విచిత్ర తంతు జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, బెల్లం అద్దుకుని చేతిలో త్రిశూలధారులై అక్షింతలు చల్లుకుంటూ రాజేశ్వరస్వామి వారిని వివాహమాడారు. సాయంత్రం జరిగిన రథోత్సవంలో వేలాదిమంది పాల్గొని జానకీరాములను దర్శించుకున్నారు.
 
 కందకుర్తిలో రామయ్య జన్మదిన వేడుకలు...

 నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం రామయ్య జన్మదిన వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామయ్యకు నామకరణం చేసి భాజాభజంత్రీలతో వేడుకలు నిర్వహించారు. భద్రాచలంతోపాటు రాష్ట్రంలో శ్రీరామనవమి పర్వదినం రోజున సాధారణంగా సీతారామ కల్యాణం నిర్వహిస్తుంటారు. కందకుర్తిలో మాత్రం జన్మదిన వేడుకలు జరుపుతారు. ఇదే ఈ రామాలయ విశిష్టత.
 
 నేడు తిరుమలలో శ్రీరామ పట్టాభిషేకం
 శ్రీరామనవమిని పురస్కరించుకుని మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైదిక కార్యక్రమాలు వేడుకగా సాగాయి. తొలుత ఉదయం వేళలో ఉత్సవమూర్తులకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు హనుమంత వాహన సేవ వైభవంగా సాగింది. భక్తాగ్రేసరుడైన హనుమంతునిపై మలయప్పస్వామి శ్రీరామచంద్ర మూర్తి రూపంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటల తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రి 8 గంటల తర్వాత ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
 
 నేడు మహా పట్టాభిషేకం

 భద్రాచలంలోని మిథిలా స్టేడియంలోని స్వామివారి పెళ్లి వేడుక జరిగిన కల్యాణ మండపంపైనే బుధవారం స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఈ వేడుక జరుగుతుంది. వీవీఐపీ, వీఐపీ సెక్టార్లుగా విభజించి భక్తులకు రూ. 250, రూ.100 టికెట్లను విక్రయిస్తున్నారు. కాగా, ఈసారి సార్వత్రిక ఎన్నికల పనుల్లో నిమగ్నమైన అధికారులు  కల్యాణోత్సవాలపై దృష్టి సారించలేకపోయారు. ఫలితంగా కల్యాణం టికెట్లు భారీగానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. రూ.100 విలువ గల టికెట్లు మొదలుకొని చివరకు వీవీఐపీ, ఉభయదాతల టికెట్లు కూడా మిగిలిపోగా, వీటి విలువ సుమారు రూ.20 లక్షలపైనే ఉంటుందని సమాచారం.

మరిన్ని వార్తలు