గా‘నైట్’

9 Mar, 2015 09:19 IST|Sakshi


     జిల్లా సరిహద్దులు దాటుతున్న స్టోన్
     నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు..
     అధిక లోడ్‌తో వెళ్తున్న లారీలు
     గుంతలు పడుతున్న రహదారులు
     పభుత్వ ఆదాయూనికి రూ.కోట్లలో గండి
     పట్టించుకోని అధికార యంత్రాంగం


 కాజీపేట : జిల్లాలో దాదాపు 200 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి 110 నుంచి 120 వరకు ఉండగా.. అనుమతి లేనివి 50 నుంచి 60 వరకు ఉంటారుు. వివిధ కారణాలతో నడవనివి దాదాపు 20 నుంచి 40 వరకు ఉన్నారుు. ప్రధానంగా శాయంపేట, కొండపర్తి, మడికొండ, ధర్మసాగర్, మహబూబాబాద్, ఏటూరునాగారం, కేసముద్రం తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారుు. ఈ ప్రాంతాల క్వారీల నుంచి రోజు రాత్రి వందల సంఖ్యలో గ్రానైట్ లోడ్ లారీలు కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని అయోధ్యపురం రైల్వేట్రాక్‌కు చేరుకుంటున్నారుు. తెల్లవారే సరికి అవి రైళ్లలో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు చేరుకుంటున్నారుు. అక్కడి నుంచి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ఈ ముడి గ్రానైట్ అందమైన ఆకృతిలో తయూరై మళ్లీ దిగుమతి అవుతోంది. ఉదాహరణకు జిల్లాలో రూ.100కు ఎగుమతి చేసిన గ్రానైట్ రాయి విదేశాల్లో ఆకృతి మార్చుకుని రాగానే మనం రూ.1000కి కొనుగోలు చేస్తున్నాం. సీమాంధ్ర, బెంగళూరు, చెన్నైకి చెందిన పలువురు వ్యాపారులు జిల్లాలో ని క్వారీల యజమానులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా.. ప్ర భుత్వానికి పన్ను చెల్లించకుండా రాత్రి వేళల్లో జిల్లా సరిహద్దుల నుంచి విదేశాలకు గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రూ.కోట్లలో దందా జరుగుతుం డగా.. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయూనికి గండి పడుతోంది.
 నిబంధనలు గాలికి..
 క్వారీల నుంచి తరలించే గ్రానైట్ లారీకి ఒక్కోదానికి మూడు నెలలకోసారి రూ.8,500 చొప్పున ప్రభుత్వానికి రోడ్‌ట్యాక్స్ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల ట్రక్కులో 25 టన్నుల గ్రానైట్, 12 టైర్ల ట్రక్కులో 31, 14 టైర్ల ట్రక్కులో 35, 18 టైర్ల ట్రక్కులో 41, 22 టైర్ల ట్రక్కులో 49 టన్నుల గ్రానైట్ మాత్రమే తీసుకెళ్లాలి. కాగా ఆయా ట్రక్కు ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ చేస్తున్నారు. సామర్థ్యానికి మించి లోడులో 22 టన్నుల నుంచి 32 టన్నుల వరకు అదనంగా వేసి రవాణా చేస్తున్నారు. టన్నుకు రూ.1,060 చొప్పున మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 25 టన్నులకు రూ.26,500 పన్నుల రూపకంగా చెల్లించాల్సి ఉండగా, ఒక ట్రక్కులో సుమారు 45 టన్నుల మేర వేసి రూ.21,200 పన్ను ఎగ్గోడుతున్నారు. దీంతోపాటు రవాణా భారం కూడా తగ్గుతుంది. రెండు సార్లు తీసుకెళ్లాల్సిన గ్రానైట్ రాళ్లను ఒకేసారి తీసుకెళ్లడంతో ఒక్క లోడుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా అవుతోంది.
 నెలకు రూ.లక్షల్లో వసూళ్లు
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న ట్రక్కులను అధికారులు పట్టుకుని సీజ్ చేసి టన్నుకు రూ.1000 చొప్పున జరిమానా విధిం చాలి. కానీ, అధికారులు కాసులకు కక్కుర్తి పడి టన్నుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక క్వారీల యజమానులు, వ్యాపారులు ముందస్తుగానే అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని.. రూ.లక్షలు ముచ్చజెప్పి ఇబ్బంది లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో చెక్ పోస్టుల వద్ద అధికారులు ఆపడం లేదు. ఇక.. క్వారీల యజ మానులు గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వేస్తున్నారు. చీక టి పడుతుందంటే చాలు.. జిలెటిన్‌స్టిక్స్ పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజ లు ఉలిక్కిపడుతున్నారు. ఇళ్ల పునాదులు కదలడంతోపాటు క్వారీ పరిసరాల్లోని పంటలు నాశనమవుతున్నారుు. దీనికి తోడు అధిక లోడ్‌తో వెళ్లడంతో రహదారులపై ఉన్న కల్వర్టులు, పైప్‌లైన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు.

 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
 ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రాయిని తరలించడం నేరం. జిల్లాలో మైనింగ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అదనపు లోడుతో వెళ్తున్న వాహనాలపై జరిమానా వేస్తున్నాం. క్వారీల వివరాలు కావాలంటే సమాచారహక్కు చట్టం కింద ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.
 - బాలరాజుగౌడ్, అసిస్టెంట్ డెరైక్టర్, మైన్స్ అండ్ జియాలజీ

 
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా