గ్రానైట్‌ పోరు ఉధృతం

30 Sep, 2019 10:37 IST|Sakshi
బంద్‌తో నిలిచిన గ్రానైట్‌ రవాణా లారీలు

నేడు కరీంనగర్‌లో యజమానులు, ఉద్యోగుల ర్యాలీ 

గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమలన్నీ మూకుమ్మడి ఆందోళన 

ఎంపీ సంజయ్‌ పరిశ్రమల ఉసురు తీస్తున్నారు : క్వారీలు, ఫ్యాక్టరీల యజమానుల ఆరోపణ 

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో గ్రానైట్‌ పరిశ్రమ చేపట్టిన నిరసన రెండోరోజు కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమకు చెందిన క్వారీలు, కటింగ్‌ ఫ్యాక్టరీలు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలన్నీ బంద్‌లో పాల్గొన్నాయి. క్వారీలన్నీ మూతపడగా, కటింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. క్వారీలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు చెందిన 550 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్‌ జిల్లా గ్రానైట్‌ క్వారీ అసోసియేషన్, గ్రానైట్‌ లారీ అసోసియేషన్, జిల్లా గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌తో పాటు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న వర్కర్లు, ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డి మాండ్‌ చేస్తూ సోమవారం పద్మానగర్‌ నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి క లెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

పరిస్థితి మారకపోతే నిరవధిక బంద్‌ 
ఈ సందర్భంగా గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. శంకర్, ప్రధాన కార్యదర్శి గంగుల ప్రదీప్, లారీ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు తోట శ్రీపతిరావు, అధ్యక్షుడు రెడ్డవేని మధు తదితరులు వేర్వేరుగా ఆదివారం మీడియా సమావేశాల్లో మాట్లాడారు. గ్రానైట్‌ పరిశ్రమను విధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం నుంచి పరిశ్రమతో సంబంధం ఉన్న అన్ని విభాగాలను మూసివేసి బంద్‌ పాటిస్తున్నట్లు తెలిపారు. సోమవారం భారీ ర్యాలీతో తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. గ్రానైట్‌ ఇండస్ట్రీని మాఫియాగా చిత్రీకరించి, తమను వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నెలరోజుల తరువాత నిరవధిక బంద్‌ పాటించనున్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే 250 క్వారీల సంఖ్య సగానికి సగం తగ్గిపోగా, ఇప్పటికీ జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా వేలాది మంది  క్వారీల్లో పనిచేస్తున్నారని చెప్పారు.

300 గ్రానైట్, కటింగ్‌ , పాలిషింగ్‌ యూనిట్లలో పరిశ్రమల యజమానులతోపాటు 10 వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారని వివరించారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ చేస్తున్న అసత్య ప్రచారంతో వీరంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. గ్రానైట్‌ క్వారీల మీద ఆధారపడే ఈ పరిశ్రమలు నడుస్తుండగా, క్వారీలు నిర్వహిస్తున్న వారిని మాఫియాతో పోలుస్తూ , ప్రభుత్వానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ పరిశ్రమను మూసివేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రానైట్‌ లారీ అసోసియేషన్‌ పరిధిలో 550 లారీలు ఉండగా వేలాది మంది వీటిని ఆధారం చేసుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు. సంజయ్‌ చర్యలతో గనుల శాఖ వేధింపులకు గురిచేస్తే క్వారీలు మూత పడతాయని, అప్పుడు లక్షలాది మందికి ఉపాధి కరువవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.     

మరిన్ని వార్తలు