రండి రండి రండి.. దయచేయండి!

7 Jul, 2018 02:18 IST|Sakshi

పులులను ఆకర్షించడం కోసం అడవుల్లో గడ్డి పెంపకం  

కవ్వాల్‌ ఫారెస్టులో 2,700 హెక్టార్లు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: పక్క రాష్ట్ర అడవుల నుంచి పులులను ఆకర్షించడం కోసం అధికారులు అడవుల్లో గడ్డిని పెంచే పనిలో పడ్డారు. ఆహారం కోసం వేట సాగించేందుకు పులి గడ్డి ప్రాంతాలను ఎక్కువగా వాడుకుంటుందని, దీని కోసం నల్లమల, కవ్వాల్‌లో గడ్డిని పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కవ్వాల్‌ అభయారణ్యంలోని 2,700 హెక్టార్లు కేటాయించి ప్రణాళికలు రూపొందించారు.

శాఖాహార అటవీ జంతువులు ఇష్టంగా తినే 14 రకాల గడ్డి జాతులను గుర్తించి ప్రతి బీట్‌లో కనీసం 2.5 హెక్టార్ల చొప్పున పెంచనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా జన్నారం ఫారెస్టు డివిజన్‌లోని 500 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ దశలవారీగా పనులు చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోనూ గడ్డిని పెంచే ప్రక్రియను మొదలుపెట్టారు. 55 వాగులు, 21 కుంటలు, 163 నీటి తొట్టెల చుట్టూ గడ్డిని పెంచుతున్నారు. మూడు నెలల్లో ఇది పెరిగి క్షేత్రాలుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

విత్తన సేకరణకు, ఆహారంగా..
వన్యప్రాణులకు ఆహారంగా ఉపయోగపడేలా, విత్తనాలను సేకరించి భద్రపరిచేలా రెండు రకాలుగా గడ్డిని పెంచనున్నారు. విత్తన సేకరణ కోసం కవ్వాల్‌లోని తాళ్లపేట రేంజ్‌ లింగాపూర్‌ బీట్‌లో 30 హెక్టార్లు, నల్లమలలో అమ్రాబాద్‌ బీట్‌లోని బుగ్గ వాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాలను గుర్తించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో 2,7000 హెక్టార్లలో కవ్వాల్‌ అభయారణ్యాన్ని అభివృద్ధి చేసి 2012లో టైగర్‌ సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు.

మహారాష్ట్రలోని తాడోబా ఫారెస్టు నుంచి పులులు ఇటుగా వస్తాయని అధికారులు భావించారు. అయితే వచ్చిన పులులు తిరిగి వెళ్లిపోతుండటంతో దానిపై దృష్టి సారించారు. నల్లమలలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ఈ అడవుల్లోకి వచ్చిన పులులను ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఆహారం సులువుగా లభించేలా, తక్కువ వేటకు వీలుగా, శాఖాహార జంతువులను ఆకర్శించేందుకు గడ్డిని పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు