పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర

14 Jan, 2019 04:21 IST|Sakshi

తీసుకురావాలని అభిప్రాయపడ్డ వక్తలు, రాజకీయ నేతలు

ఘనంగా మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చి భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలని పలువురు రాజకీయ, ప్రముఖ వక్తలు అభిప్రాయపడ్డారు. గొప్ప పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడైన చెన్నారెడ్డిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి శత జయంతి (100) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రతిపక్షాల దాడిని సైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ చెన్నారెడ్డి ఒకరని కితాబిచ్చారు. చెన్నారెడ్డి జీవితం పట్టువిడుపులా ఉండేదని, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపారు.

గొప్ప వ్యక్తిత్వం గల బహుముఖ ప్రజ్ఞశాలి చెన్నారెడ్డి అని కొనియాడారు. మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. చెన్నారెడ్డి కొందరివాడు కాదని, అందరి వాడని, తనతో విభేదించే వారిని కూడా ఆమోదింపజేసుకునే విలక్షణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్లు రోశయ్య, రాంమోహన్‌రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, నంది ఎల్లయ్య, టి.సుబ్బరామిరెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి.

మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సమర సింహారెడ్డి, ఉమావెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, కాంగ్రెస్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, కిష్టయ్య, దైవజ్ఞశర్మ, ఏఐసీసీ సభ్యుడు ఎం.సూర్యనాయక్, మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన సమాధి, విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు