ఆధునిక రూపశిల్పి హైదరాబాదీయే

19 Jun, 2015 02:19 IST|Sakshi
ఆధునిక రూపశిల్పి హైదరాబాదీయే

సమకాలీన నిర్మాణశైలికి చార్లెస్ కొరియా ఆద్యులు
సాక్షి, సిటీబ్యూరో:
స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతీయ కట్టడాల రూపశిల్పి చార్లెస్ కొరియాకు నగరంతో విడదీయరాని అనుబంధం ముడిపడి ఉంది. ఈసీఐఎల్ పరిపాలన భవనం, గచ్చిబౌలీలోని జవ హర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆఫీస్ వంటి అద్భుతమైన నిర్మాణాలకు రూపకర్త. కొరియా సమకాలీన నిర్మాణ శైలికి ఆద్యులు. స్వాతంత్య్రానికి ముందు ప్రాచుర్యంలో ఉన్న  ఇండో అరబిక్, ఇండో గ్రీక్  శైలుల  తరువాత  కొరియా  నిర్మాణశైలితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప కట్టడాలను  ఆవిష్కరించారు.

అలాంటి నవ భారత శిల్పి తన 84వ ఏట  అనారోగ్యంతో ముంబైలో కన్నుమూసిన సంగతి  తెలిసిందే. గురువారం ఆయన  పార్ధివదేహానికి దాదర్‌లో అంత్యక్రియలు జరిగాయి. విద్యాభ్యాసం మొదలుకొని ఆర్కిటెక్ట్‌గా ఉన్నత శిఖరాలను చేరుకోవడం వరకు  ముంబై కేంద్రంగానే చార్లిస్ కొరియా ఎదిగినప్పటికీ ఆయనకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. ఆయన తండ్రి కార్లోస్ కొరియా గోవా నుంచి సికింద్రాబాద్‌కు మకాం మార్చారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన విధి నిర్వహణలో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చినట్లు  సమాచారం. కానీ చార్లెస్ తండ్రిని చూడలేకపోయారు. ఆయన జన్మించడానికి వారం ముందే తండ్రి మరణించారు. 1930 సెప్టెంబర్ 1న చార్లెస్ కొరియా జన్మించారు. చార్లెస్ కుటుంబం లాలాగూడలో ఉండేది. భర్త మరణించిన కొద్ది రోజులకు చార్లెస్ తల్లి తన తండ్రి సొంత ఊరు ముంబైకి వెళ్లిపోయారు.

దాంతో చార్లెస్ బాల్యం, విద్యాభ్యాసం ముంబైలోనే గడిచాయి. ముంబై వాసిగా కొనసాగినప్పటికీ హైదరాబాద్‌తో ఆయన అనుబంధం నిర్మాణరంగంలో చెక్కుచెదరని అద్భుతమైన కళాఖండాలుగా నిలిచిపోయింది. ఈసీఐఎల్ సహా పలు భవనాలకు డిజైనింగ్ రూపొందించారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎల్‌ఐసీ భవనాలకు కూడా ఆయన రూపకర్త అని సమాచారం. నగరంలోని పలు ఐటీ కార్యాలయాలను, వారసత్వ కట్టడాలను ఆయన సందర్శించారు. 2008లో ఆయన తన తండ్రి సమాధిని సందర్శించేందుకు సికింద్రాబాద్‌కు వచ్చారు. చార్లెస్ అల్లుడు రాహుల్ మెహ్రోత్రా ముంబైలో ప్రముఖ ఆర్కిటెక్ట్. చార్లెస్ మరణం పట్ల పలువురు నగర వాసులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
 
సీఎం సంతాపం..
ప్రముఖ ఆర్కిటెక్ట్  చార్లిస్ కొరియా మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అత్యాధునిక శైలిలో  గొప్ప గొప్ప కట్టడాలను ఆవిష్కరించిన  చార్లెస్ సేవలను సీఎం కొనియాడారు.హైదరాబాద్ నగరంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
సహజత్వం ఉట్టిపడేలా కట్టడాలు...
అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమంలోని గాంధీ స్మారక మ్యూజియం మొదలుకొని దేశ, విదేశాల్లో ఆయన రూపొందించిన అద్భుతమైన కట్టడాలు సహజమైన గాలి, వెలుతురు ప్రసరించే విధంగా రూపుదిద్దుకున్నాయి. భవన నిర్మాణానికి ఆయన విరివిగా గ్లాసెస్ వినియోగిస్తారు.పర్గోలా శైలిగా వ్యవహరించే ఈ నిర్మాణంలో సూర్యుని వెలుతురు అద్దాలపైన పడి భవనం అంతా సహజమైన వెలుతురుతో అలరారుతుంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ఆయన నిర్మాణశైలిలోని ప్రత్యేకత. ఈసీఐఎల్ పరిపాలనా భవనం అదేవిధంగా రూపుదిద్దుకుంది. ఇప్పటికీ ఎంతోమంది ఆర్కిటెక్ట్ విద్యార్థులు ఆ భవనాన్ని సందర్శించి నిర్మాణశైలిని అధ్యయనం చేయడం  విశేషం. చార్లెస్ రూపొందించే భవనాలు సహజత్వం ఉట్టిపడేవిధంగా ఉంటాయి. అందమైన లాండ్‌స్కేప్‌లుగా తీర్చిదిద్దుతారు. విశాలమైన ఖాళీ స్థలాలు, పార్కులు, జలాశయాలతో సహజత్వం ప్రతిబింబించే విధంగా  ఆయన శైలి ఉంటుంది.
 
నగరవాసి కావడం గర్వంగా ఉంది
చార్లెస్ కొరియా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉంది. అంతర్జాతీయంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆయన పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన తండ్రి కార్లోస్ కొరియా సమాధి సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఎక్కడో కనుక్కొని వెళ్లాలనుకుంటున్నాను.
 - అనురాధ, ఇంటాక్
 
గొప్పవాళ్లు మన మధ్యే ఉన్నారు..
చార్లెస్ కొరియా వంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. రాజధాని నిర్మాణం, విశ్వనగర నిర్మాణాల కోసం సింగపూర్‌కో, మరో దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక నిర్మాణాలకు చార్లెస్ రూపశిల్పి కావడం, ఆ నిర్మాత మన హైదరాబాద్‌కు చెందినవాడు కావడం చాలా సంతోషంగా ఉంది.    - ఎం. వేదకుమార్,
 ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్

మరిన్ని వార్తలు