కేశవరెడ్డికి కన్నీటి వీడ్కోలు

15 Feb, 2015 01:30 IST|Sakshi

డిచ్‌పల్లి/నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి అంత్యక్రియలు శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి శివారులోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో జరిగాయి. ఈ ఆస్పత్రిలో డాక్టర్ కేశవరెడ్డి సుమారు 30 ఏళ్లపాటు కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించారు. తన భౌతికదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలన్న ఆయన కోరిక మేరకు  శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలోని సీఎంసీ చర్చి ప్రాంగణంలో కేశవరెడ్డి పార్థివదేహాన్ని సందర్శనార్ధం ఉంచారు. రెవరెండ్ ఎం.చరణ్ నేతృత్వంలో ప్రార్థనలు  నిర్వహించారు. అనంతరం డాక్టర్ భౌతికదేహాన్ని సమాధుల స్థలం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు.

కేశవరెడ్డి అంత్యక్రియలకు ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న, నాళేశ్వర శంకర్, బైస రామదాసు, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్, సైదాచారి, ఉష, అరవి, ఎనిశెట్టి శంకర్,  సూర్యప్రకాశ్, చందన్‌రావు, మేక రామస్వామి, సిద్దార్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆశ నారాయణ, మానవ హక్కుల సంఘం సభ్యుడు గొర్రెపాటి మాధవరావు, న్యాయవాదులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని కేవశరెడ్డి భౌతికదేహం వద్ద నివాళులు అర్పించారు. డాక్టర్ కేశవరెడ్డితో తన అను బంధాన్ని గుర్తు చేసుకుంటూ గోరెటి వెంకన్న ‘బతుకు మర్మమెరిగిన నవలా శిల్పి, మర్మయోగి గొంతు మూగబోయేనా’ అంటూ పాడిన పాట అంద రి హృదయాలను బరువెక్కించింది.


 

మరిన్ని వార్తలు