తర్జన భర్జన..!

20 Oct, 2018 10:54 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రస్తుత ముందుస్తు ఎన్నికల్లో మాత్రం తర్జనభర్జనల్లో మునిగిపోయింది. ఈ ఎన్నికల్లో  ఆ పార్టీ కాంగ్రెస్‌తో జతకడుతోంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పోటీ చేయగా, దేవరకొండ నుంచి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు స్థానాలను కోరుతోంది. ఈ సారి ఆలేరు, మునుగోడు, దేవరకొండ నుంచి పోటీ చేయాలని సంస్థాగతంగా నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగానే మహాకూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం వద్ద తమ ప్రతిపాదనలు పెట్టింది. కానీ, ఇంకా పొత్తులు ఖరారు కాకపోవడం, ఏ స్థానాల్లో పోటీ చేస్తామో తేలకపోవడంతో సీపీఐ కేడర్‌ రుసరుస లాడుతోంది. మరోవైపు తాము కోరుతున్న స్థానాల్లో అప్పుడే కాంగ్రెస్‌ ఆశావహులు ప్రచారం కూడా మొదలు పెట్టడడంతో సీపీఐ నాయకులు, ముఖ్యులు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. మిత్ర ధర్మాన్ని పాటించకుండా, తాము గతంలో ప్రాతినిధ్యం వహించిన.. ఈ సారి కోరుతున్న స్థానాల్లో అపుడే ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేడర్‌లో అసహనం !
గత ఎన్నికల్లో సీపీఐ దేవరకొండలో గెలిచింది. ఆ పార్టీ తరపున శాసనసభలో అడుగుపెట్టిన రవీంద్రకుమార్‌ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్‌ఎస్‌ గూటికి  చేరారు. సీపీఐ ఈ స్థానాన్ని తమ సిట్టింగ్‌ నియోజకవర్గంగానే భావిస్తోంది. ఇక్కడి నుంచి మధ్యలో ఒకటీ రెండు సార్లు మినహాయిస్తే, అత్యధిక కాలం సీపీఐ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సారి కూడా దేవరకొండ టికెట్‌ను సీపీఐ కోరుకుంటోంది. కానీ, కాంగ్రెస్‌ నాయకత్వం ఇక్కడ పలువురికి ఆశ పెట్టడంతో కనీసం ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు టికెట్‌ తమదే అన్న విశ్వాసంలో ఉన్నారు. ఒకరిద్దరు ప్రచారం కూడా చేస్తున్నారు. మరో వైపు మునుగోడులోనూ సుదీర్ఘకాలం సీపీఐ ఎమ్మెల్యేలే ఉన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెబల్‌ బరిలో ఉండడంతో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లోనూ మునుగోడు టికెట్‌ ఆశిస్తోంది. కానీ, ఇక్కడి నుంచి కూడా నలుగురైదుగురు కాంగ్రెస్‌ నాయకులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. మరో వైపు శాసనమండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇక, ఆలేరు విషయానికి వస్తే.. సీపీఐ ఈ సారి ఆలేరును కూడా ఆశిస్తోంది. కానీ, ఇక్కడి నుంచి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. మొత్తంగా దేవరకొండ, మునుగోడు, ఆలేరుల్లో కాంగ్రెస్‌ నుంచి బలమైన నాయకులే టికెట్‌ కోరుతుండడంతో ఈ మూడింటిలో సీపీఐకి ఏ స్థానాలు దక్కుతాయో ఇదమిద్దంగా తేలడం లేదు. ఇంకా పొత్తులు కూడా ఖరారు కాకపోవడంతో, కేటాయించే నియోజకవర్గాలపై స్పష్టత రాకపోవడంతో సీపీఐ కేడర్‌ అసహనంగా ఉంది.

నాయకత్వంపై ఆరోపణలు
కాంగ్రెస్‌తో టికెట్ల లెక్క తేలేదాకా మీనమేషాలు లెక్కపెట్టడం ఎందుకున్న ఆలోచనతో సీపీఐ నాయకత్వం ఇటీవల కొంత చొరవ తీసుకుని నియోజవకర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మునుగోడులో సమావేశం పెట్టి, ర్యాలీ కూడా నిర్వహించిన ఆ పార్టీ నాయకత్వం శుక్రవారం దేవరకొండలో కార్యకర్తలతో భేటీ అయ్యిం ది. టికెట్లు కోరాల్సిన సమయంలో, కాంగ్రెస్‌ నా యకత్వంపై ఒత్తిడి పెట్టాల్సిన సమయంలో జిల్లా నుంచి రాష్ట్ర నాయకత్వంలో కొనసాగతున్న నా యకులు కొందరు విదేశీ పర్యటనలకు వెళ్లారని, జిల్లా ఎన్నికల రాజకీయాన్ని గాలికి వదిలేశారన్న విమర్శలు వచ్చాయి.

ఈ విషయంలో సీపీఐలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. కాంగ్రెస్‌లోని ఒక నాయకుడితో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లే వారు జిల్లా రాజకీయాన్ని పక్కన పెట్టారన్న ఆరో పణల నేపథ్యంలో వారం రోజులుగా సీపీఐ నా యకత్వం స్పీడు పెంచింది. పొత్తుల లెక్క తేలేలోగా కార్యకర్తలను సమీకరించుకుని సిద్ధంగా ఉండాలన్న వ్యూహంలో భాగంగా వేగంగా పావులు కదుపుతోందన్న అభిప్రాయ పడుతున్నారు.  

మరిన్ని వార్తలు