ఇప్పట్లో లేనట్టే?

19 Oct, 2014 23:55 IST|Sakshi
ఇప్పట్లో లేనట్టే?
  •  గ్రేటర్ ఎన్నికలు వాయిదా?    
  •  జీహెచ్‌ఎంసీలో కానరాని హడావుడి
  •  ప్రారంభం కాని సర్కిళ్లు, డివిజన్ల పునర్విభజన
  • జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు మరో రెండు నెలల్లో ముగిసిపోతోంది. అయినా గ్రేటర్ యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమవుతున్న సూచనలు కనిపించడం లేదు.  డివిజన్ల పునర్విభజన... బీసీల గణన వంటి కార్యక్రమాలకు కసరత్తే ప్రారంభం కాలేదు.  ఫలితంగా గడువులోగా ఎన్నికలు జరిగే అవకాశాలుకానరావడం లేదు.
     
    సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరో రెండు నెలల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్నా ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. సర్కిళ్లు, డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల అమలుకు బీసీల గణన జరగాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క ప్రక్రియ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో కొత్త పాలకుల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఎన్నికల్లోగా డివిజన్ల పునర్విభజన చేయాలని కోర్టు సూచింది.

    ఈ తీర్పును అమలు చేయనిదే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. ఇంతవరకూ జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశాలు అందాకే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంబంధిత అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు బీసీ జనగణన చేయాల్సి ఉంది.

    2011లో జరిగిన జనగణనలో భాగంగా ఎస్సీ, ఎస్టీలు, స్త్రీ పురుషుల వివరాలు ఉన్నప్పటికీ, బీసీల సమాచారం లేదు. వీటితోపాటు ఓటర్ల జాబితాలోనూ పొరపాట్లు ఉన్నాయి. రెండు చోట్ల ఓట్లున్న వారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరి పేర్లను తొలగించాల్సి ఉంది. డీ డూప్లికేషన్ జరగాల్సి ఉంది. అందుకుగాను జీహెచ్‌ఎంసీలో ఓటరు కార్డుల అనుసంధానం ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.
     
    విభజన పూర్తయ్యాకే..

    పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీలో ప్రస్తు తం ఉన్న 18 సర్కిళ్ల స్థానే 30 ఏర్పాటు చేయాలని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుత సర్కిళ్లలో కొన్నింట్లో ఎక్కువ డివిజన్లు.. కొన్నింట్లో తక్కువ డివిజన్లు ఉన్నాయి. అన్నిచోట్లా సమాన సంఖ్యలో డివిజన్లు ఉండాలని ప్రసాదరావు కమిటీ సిఫార్సు చేసింది.

    ఒక్కో సర్కిల్‌లో ఐదు డివిజన్ల వంతున 150 డివిజన్లు ఉండాలని కమిటీ పేర్కొంది. జనాభాకు అనుగుణంగా పునర్విభజన జరిగితే ప్రస్తుతమున్న డివిజన్ల సంఖ్య 150 నుంచి 180కి పెంచాల్సి ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. వీటన్నింటిపైనా ఇంతవరకు కసరత్తు ప్రారంభం కాకపోవడం ఒక ఎత్తుకాగా, జీహెచ్‌ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా మార్చాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైతే విభజన జరిగాకే ఎన్నికలకు వెళతారని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా  వివిధ అంశాల్లో దేనిపైనా ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జాప్యం తప్పేలా లేదు.
     
    టీఆర్‌ఎస్ బలోపేతమయ్యాకే...


    మరోవైపు ఆర్నెళ్లు ఆలస్యమైనా సరే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ బలం పుంజుకున్నాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు ఇటీవల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ ఒక ఎత్తు కావడం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలతో గెలవాలనేది పార్టీ లక్ష్యం. అందుకుగాను ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రక్రియ మొదలైంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే అత్యధిక సీట్లు పొందేందుకు ఇంకొంత సమయం తీసుకున్నా ఫర్వాలేదనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్నికలు ఆలస్యమయ్యేందుకు దారి తీసేలా ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు