‘హా’ర్టీసీ!

31 Oct, 2018 09:47 IST|Sakshi

రూ.207 కోట్లకు చేరిన వైనం

భారీగా పెరిగిన నిర్వహణ వ్యయం

డీజిల్‌ పైనే రూ.40 కోట్లకు పైగా అదనపు భారం  

ఆదాయానికి రెట్టింపు ఖర్చు

ప్రశ్నార్థకంగా మారిన మనుగడ

సాక్షి, సిటీబ్యూరో: వరుసగా పెరిగిన డీజిల్‌ ధరలు, ఆదాయానికి రెట్టింపు నిర్వహణ వ్యయం గ్రేటర్‌ ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయే కానీ ఒక్క రూపాయి కూడా తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.273 కోట్ల నష్టాలు నమోదు కాగా, అందులో గ్రేటర్‌ నష్టాలే ఏకంగా రూ.207 కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రజారవాణా సంస్థగా వెలుగొందుతున్నప్పటికీ నష్టాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకు రూ.3.68 కోట్ల ఆదాయం వస్తే.. నిర్వహణ ఖర్చు రూ.4.65 కోట్ల చొప్పున నమోదవుతోంది.

చివరకు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లోనూ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో  అభిప్రాయపడ్డారు. గత 2 నెలలుగా నాలుగైదు రోజులు ఆలస్యంగా అందజేస్తున్నట్లు  తెలిపారు. ఈ ఏడాదిఇప్పటి వరకు నగరంలో రూ.744 కోట్ల ఆదాయం లభించగా డీజిల్, విడిభాగాలు, బస్సుల మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతభత్యాలు తదితర అవసరాల కోసం రూ.953 కోట్ల మేర ఖర్చయింది. డీజిల్‌పైనే 30 శాతానికి పైగా భారం పెరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌ ఆర్టీసీలో మొత్తం 28 డిపోలు ఉన్నాయి. 3804 బస్సులతో ప్రతిరోజు సుమారు 41 వేల ట్రిప్పుల మేరకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా మెట్రో రైలు నుంచి గట్టి పోటీ మొదలైంది. ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ రూట్‌లో ఏసీ బస్సులు తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్నాయి. నాగోల్‌–సికింద్రాబాద్‌–అమీర్‌పేట్‌ మార్గంలోనూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా, అన్ని మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ఆర్టీసీ మనుగడ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

భారంగా ఇంధనం....
నగరంలోని ప్రతి రోజు  సిటీ బస్సులు 9.7 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందుకోసం 2.19 లక్షల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఇంధన సంస్థల నుంచి ఆర్టీసీ పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్న దృష్ట్యా బహిరంగ మార్కెట్‌లో ఉండే ధరల కంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం లీటర్‌ ధర రూ.80.33 వరకు ఉండగా ఆర్టీసీకి రూ.77కు లీటర్‌ చొప్పున అందజేస్తున్నారు. అయినప్పటికీ ఏడాది కాలంలో లీటర్‌పైన రూ.15 వరకు పెరిగినట్లు  అంచనా. నగరంలో వాహనాల రద్దీ, ఎక్కువ సేపు బస్సులను ఐడలింగ్‌లో ఉంచడం వంటి  కారణాల దృష్ట్యా గ్రేటర్‌ ఆర్టీసీలో డీజిల్‌ వినియోగం సగటున ఒక లీటర్‌కు 4 కిలోమీటర్ల చొప్పున ఉంది. ఏసీ బస్సులు ఒక లీటర్‌కు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు, మెట్రో బస్సులు 4 కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 4.5 కిలోమీటర్ల చొప్పున వినియోగిస్తున్నాయి. మొత్తంగా పెరిగిన డీజిల్‌ ధరల ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ.103 కోట్ల వరకు డీజిల్‌పైన భారం నమోదు కాగా, హైదరాబాద్‌లో అది రూ.40 కోట్లకు పైగా ఉంది.  

పుట్టి ముంచుతున్న అద్దె బస్సులు...
అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపైన వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే భారంగా పరిణమించింది. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న 462 బస్సులపైన గ్రేటర్‌ ఆర్టీసీ సుమారు రూ.80 కోట్లు అద్దెల రూపంలో చెల్లించింది. కానీ   ఆ బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం కేవలం రూ.58 కోట్లు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాది కాలంలోనే వచ్చిన ఆదాయం కంటే అదనంగా  రూ.22 కోట్లు చెల్లించవలసి వచ్చింది. అదనంగా చెల్లించిన రూ.22 కోట్లతో  కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకొనే అవకాశం ఉండేది. కేవలం ప్రైవేట్‌ ఆపరేటర్ల స్వలాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకొంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ఇదీ గ్రేటర్‌ ఆర్టీసీ  పరిస్థితి ...
మొత్తం డిపోలు : 28 ,    –నగరంలో తిరిగే  బస్సులు : 3804  
ప్రయాణికుల సంఖ్య  33 లక్షలు,ఆక్యుపెన్సీ రేషియో :  68 శాతం   
రోజూ తిరిగే  ట్రిప్పులు  41,110 :   కిలోమీటర్‌లు  :  9 లక్షలు
రోజూ వచ్చే ఆదాయం రూ. 3.68 కోట్లు  : రోజువారీ ఖర్చు :  రూ.4.65 కోట్లు
ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి లభించిన ఆదాయం రూ.744 కోట్లు  
బస్సుల నిర్వహణ కోసం చేసిన ఖర్చు రూ.953 కోట్లు
సెప్టెంబర్‌  నాటికి నమోదైన నష్టాలు :  రూ.207 కోట్లు

మరిన్ని వార్తలు