స్టీరింగ్‌ పట్టేద్దాం..

16 May, 2020 07:39 IST|Sakshi

హయత్‌నగర్‌ టు బీహెచ్‌ఈఎల్‌

సికింద్రాబాద్‌ టు మేడ్చల్‌ ప్రధాన రూట్లలోనే బస్సులు

40– 50 కి.మీ వరకే తిప్పాలని యోచన   

బస్టాపుల్లోనే టికెట్లు జారీ చేసే ఆలోచన   

సర్వీసుల నిర్వహణపై గ్రేటర్‌ ఆర్టీసీ కసరత్తు  

ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సు.. సామాన్యుడికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజారవాణాకు పెట్టింది పేరు. హైదరాబాద్‌ నగరంలో ఏ మూలన ఉన్నా సరే ఏంచక్కా సిటీ బస్సు ఎక్కేసి గమ్యం చేరుకోవచ్చనే సగటు ప్రయాణికుడి భరోసాకు బలం చేకూర్చే ప్రయాణ సాధనం. ఇది కరోనాకు ముందు సంగతి. ప్రస్తుతం ఆ పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. కోవిడ్‌ నేపథ్యంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన రూట్లకే సిటీబస్సులు పరిమితం కానున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిస్తే 40 నుంచి 50 కి.మీ వరకు ఉండే ప్రధాన రూట్లలోనే బస్సులను తిప్పాలని సిటీ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. హయత్‌నగర్‌ నుంచి  బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్, ఫరూఖ్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు వంటి అతి పెద్ద రూట్లలో మాత్రమే బస్సులు నడుస్తాయి.

కోవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా బస్సుల నిర్వహణపై అధికారులు  భవిష్యత్‌ కార్యాచరణపై సీరియస్‌గా దృష్టి సారించారు. ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు ప్రవేశ ద్వారాలకు తలుపులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో పాటు వివిధ ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి దశలో ‘లిమిటెడ్‌ రూట్లు– లిమిటెడ్‌ బస్సులు’ అనే  ప్రతిపాదనను ఆచరణలోకి తెచ్చేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఒకవైపు   మెట్రో రైలు రాకతో, మరోవైపు కార్మికుల సుదీర్ఘమైన సమ్మె కారణంగా సిటీ బస్సులు పెద్దఎత్తున ప్రజాదరణను కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికితోడు పిడుగుపాటులా వచ్చి పడిన కరోనా మహమ్మారి, దానిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ వల్ల గ్రేటర్‌ ఆర్టీసీ పూర్తిగా కుదేలైంది. ఈ క్రమంలోనే సిటీ బస్సులను తిరిగి గాడిన పెట్టేందు కు అధికారులు మొదట కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే బస్సులను నడపాలని నిర్ణయించారు.

కండక్టర్‌ లెస్‌ సర్వీసులు..
సరికొత్త మార్పులకు అనుగుణంగా కండక్టర్‌లెస్‌ సర్వీసులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. దీంతో వారు బస్సుల్లో కాకుండా బస్టాపుల్లో ఉండి టికెట్లు ఇస్తారు.  ప్రతి బస్టాపునకు ఇద్దరు చొప్పున రెండు విడతలుగా విధులు నిర్వహించనున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు రెండు వైపులా 60 బస్టాపులు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేందుకు 120 మంది కండక్టర్లు అవసరం. ఇలా ఎంపిక చేసిన ప్రతి రూట్‌లో ఉన్న బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా కండక్టర్లను ఏర్పాటు చేసి టికెట్ల జారీ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ‘దీనివల్ల ప్రయాణికుల మధ్య, సిబ్బంది మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుకలుగుతుంది. పైగా మాస్కులు ఉన్న వారికే కండక్టర్లు టికెట్లు ఇస్తారు. వారు మాత్రమే బస్సెక్కుతారు. మరోవైపు ఏ బస్టాపులో ఎంతమంది ప్రయాణికులు ఎక్కారనే దానిపై కూడా ఒక నిర్దిష్టమైన అంచనా ఉంటుంది’ అని ఆర్టీసీ గ్రేటర్‌  హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో  చెప్పారు. డిపోల్లోంచి బయలుదేరే ప్రతి బçస్సునూ పూర్తిగా శానిటైజ్‌ చేసి కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రోడ్డెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బస్సులు నడపడంతో పాటు ప్రయాణికులు, సిబ్బంది రక్షణ కూడా తమకు ఎంతో ముఖ్యమని, అందుకనుగుణంగానే బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. 

మొదట 50 రూట్లలోనే..  
సాధారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,150 రూట్లలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు సుమారు 35 వేలకుపైగా ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. కరోనా కారణంగా  కేవలం 50 ప్రధాన రూట్లకే మొదట బస్సులను పరిమితం చేయనున్నారు. లాంగ్‌ రూట్లలోనే తిరుగుతాయి. తక్కువ దూరం ఉన్న మార్గాల్లో ఎలాంటి సర్వీసులు ఉండవు. ఈ మేరకు మొదటి విడతలో మేడ్చల్‌– సికింద్రాబాద్, హయత్‌నగర్‌– బీహెచ్‌ఈఎల్, ఫరూఖ్‌నగర్‌– పటాన్‌చెరు వంటి రూట్లను ఎంపిక చేయనున్నారు. 

మరిన్ని వార్తలు