ఆదివాసీ జోష్‌..

10 Aug, 2018 10:43 IST|Sakshi
భద్రాచలంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న ఆదివాసీలు

అంగరంగ వైభవంగా వేడుకలు

ఆడి..పాడిన అధికారులు, గిరిజనులు

సంస్కృతి పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాలి..

ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ పిలుపు

భద్రాచలం :  ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిరిజనుల కొమ్ము, డప్పు నృత్యాలు, ఆట పాటలు అలరించాయి. పలువురు అధికారులు కూడా వారితో కలిసి వేసిన డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ సెంటర్‌లో గల అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పీఓ పమెల సత్పథి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఐటీడీఏ ద్వారా తగిన కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గిరిజనులు మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, దాని అభివృద్ధి కోసం ఆ భాషలోనే మాట్లాడాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, వారికి విద్య, వైద్యం, అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అంతా ఏకమై ఉద్యమించాలన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక చట్టాలు వచ్చినా, పాలకులు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం శోచనీయమన్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారని, స్పెషల్‌ డీఎస్సీ లేదని, జీవో నంబర్‌ 3 అమలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. గిరిజన సహకార సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ కుంజా వాణి కోయభాషలో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు.  

అలరించిన అధికారుల నృత్యాలు..  

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ సెంటర్‌లో జెండా ఆవిష్కరించారు. అమరుల విగ్రహాలతో పాటు, ఆదివాసీ జాతి అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచిన ఆదివాసీ పెద్దల చిత్రపటాలను వేదిక వద్ద ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల వారు కలసి నృత్యాలు చేశారు. కొమ్ము నృత్యాలు, రేల పాటలతో అంబేడ్కర్‌ సెంటర్‌ కోలాహలంగా మారింది.

ఐటీడీఏ పీఓ పమెల సత్పథి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా వారితో జత కలసి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు సీహెచ్‌ రామ్మూర్తి, ఏటీడీఓ జహీరుద్ధీన్, ఐటీడీఏ ఏపీఓ భీం, భద్రాచలం తహసీల్దార్‌ పీవీ రామకృష్ణ, ఏటీఓ రమణయ్య, కొండరెడ్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్, ఆదివాసీ సంఘాల సమన్వయ కర్త మడివి నెహ్రూ, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకురాలు దామెర్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు