మంజీరా తీరం.. హరితహారం

15 Sep, 2014 23:13 IST|Sakshi

పాపన్నపేట: మంజీరా తీరం.. హరితహారంగా మారింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వెలవెలబోయిన పుడమితల్లి ఇటీవల కురిసిన వర్షాలతో హరితశోభను సంతరించుకుంది. పాపన్నపేట మండలంలో మంజీరమ్మ తల్లి సుమారు 35 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది. తీరప్రాంత రైతులు బోరు మోటార్లు ఏర్పాటు చేసుకుని తమ పంటలకు ప్రాణం పోస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవలేదు. మంజీరాలో వరదలు కనిపించలేదు. దీంతో రైతులు తుకాలు పోసేందుకు వెనకాడారు.

అనంతరం జూలైలో కురిసిన తేలికపాటి వర్షాలు, సింగూర్ నుంచి విడుదలైన నీటితో తుకాలు పోసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కింది. చెరువులు, కుంటల్లో కొంతమేర నీరు చేరింది. దీంతో వరినాట్లు ఓ మోస్తరుగా సాగాయి. సుమారు 12వేల ఎకరాల్లో వరిపంట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్నిచోట్ల వరిపంటలు పొట్టదశకు వచ్చాయి.

ముఖ్యంగా మండలంలోని లక్ష్మీనగర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుఫ్‌పేట, ఆరేపల్లి, మిన్‌పూర్, పాపన్నపేట, కొడుపాక, నాగ్సాన్‌పల్లి, గాజులగూడెం తదితర గ్రామాల్లో వరిపంటలు కళకళలాడుతోంది. మరో మూడు విడుతలు సింగూర్ నుంచి ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కె అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు