‘రెడ్‌ జోన్‌’లో గ్రీన్‌హౌస్‌!

4 Mar, 2018 04:39 IST|Sakshi

కూరగాయలు సాగుచేసి నష్టపోతున్న రైతులు

గత్యంతరం లేక మధ్యలోనే వదిలేస్తున్న వైనం

సీజన్‌లోనే దిగుబడి.. అన్‌సీజన్‌లో దిగుబడులు దారుణం

సరైన విత్తనాలు లేకపోవడం, మార్కెటింగ్‌ సౌకర్యాల కొరత..

వాతావరణం, ఇతర సాగు అంశాలపై అవగాహన కరువు

నష్టాలతో పెరిగిపోతున్న అప్పులు

గ్రీన్‌హౌస్‌లను ఏడాదిగా ఖాళీగా ఉంచేసిన రైతులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రీన్‌హౌస్‌ రైతుల వెతలు ఇవి. గ్రీన్‌హౌస్‌లో కూరగాయలు సాగుచేసిన రైతులంతా నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ సాగుకు ప్రోత్సాహం కోసం 75 శాతం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్‌హౌస్‌ సాగుకు ఎకరానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుండగా, రైతులు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,042 ఎకరాల్లో గ్రీన్‌హౌస్‌లకు అనుమతి ఇచ్చారు. అందులో 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు జరుగుతోంది. మిగతా 292 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తనాలు, సాంకేతిక అవగాహన కరువై నష్టాలపాలవుతున్నారు.     

పూలతో లాభాలు
జరబెర వంటి పూల సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుతో మాత్రం చాలా చోట్ల నష్టాలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే పూల సాగులోనూ పెద్దగా లాభాలు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి సహకారం లభించకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలం చెనుపల్లిలో ఒక రైతు సీజన్‌లో టమాటా సాగు చేశారు. కానీ ధర కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఏ సమయంలో ఏయే కూరగాయలు సాగు చేయాలన్న అవగాహన లేక ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది.

సూచనలతో లాభదాయకం
అయితే పలు చోట్ల రైతులు స్వయంగా సొమ్ము ఖర్చు చేసుకుని.. శాస్త్రవేత్తల సూచనలతో లాభాలు పొందుతున్నారు. చేవెళ్ల మండలం చెనుపల్లిలో 45 గ్రీన్‌హౌస్‌ల సాగును పరిశీలించేందుకు నెలకోసారి పుణే నుంచి శాస్త్రవేత్త వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఒక్కో రైతు రూ.3 వేల చొప్పున రూ.1.35 లక్షలు ఆయనకు చెల్లించి.. తగిన సూచనలు పొందుతుంటారు. దీంతో అక్కడ గ్రీన్‌హౌస్‌ సాగు లాభదాయకంగా ఉంది. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. సాధారణ రైతులకు అవగాహన లేక, ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక నష్టాలపాలవుతున్నారు.

నెట్‌హౌస్‌లపై దృష్టి..
గ్రీన్‌ హౌస్‌లకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చయ్యే నెట్‌ హౌస్‌పై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీనికి ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. పంజాబ్, హరియాణాల్లో నెట్‌హౌస్‌ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు నెట్‌హౌస్‌లను ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రైతు పేరు నాగిరెడ్డి.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం. రెండేళ్ల కింద ఎకరా విస్తీర్ణంలో గ్రీన్‌హౌస్‌ సాగు మొదలుపెట్టారు. రూ.10 లక్షలు అప్పుచేసి మార్జిన్‌ మనీగా ప్రభుత్వానికి చెల్లించారు. భూమిలో మట్టి మార్పు, ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు మరో రూ.5 లక్షలు ఖర్చుచేశారు. గ్రీన్‌హౌస్‌లో క్యాప్సికం, టమాటా సాగుచేశారు. కానీ దిగుబడులు సరిగా రాలేదు. సీజన్‌లో టమాటా బాగా పండినా ధర లేక నష్టం వాటిల్లింది. ఏడాదిగా గ్రీన్‌హౌస్‌ను ఖాళీగా ఉంచారు. ఇప్పుడా భూమిని అమ్మకానికి పెట్టారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన ఈ రైతుపేరు రాజిరెడ్డి. రెండేళ్ల క్రితం మూడెకరాల్లో గ్రీన్‌హౌస్‌ సాగు మొదలుపెట్టారు. కీరా, క్యాప్సికం, టమాటా పంటలు వేశారు. టమాటా ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. గతేడాది క్యాప్సికం వేసినా.. గ్రీన్‌హౌస్‌ నిర్మాణం దెబ్బతిని పంటకు నష్టం వాటిల్లిందని, వేసవిలో కీరా వేస్తే వైరస్‌ కారణంగా నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు.

ప్రత్యేక నిర్వహణ అవసరం
గ్రీన్‌హౌస్‌లో కూరగాయలు సాగు చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోతే నష్టాలు తప్పవు. ఏ సీజన్‌లో ఏ పంటలు వేసుకోవాలన్న అవగాహన ఉండాలి. వర్షాకాలంలో ఆకుకూరలు, చలికాలంలో బెండ, బీర, కాకరకాయలు పండించాలి. క్యాప్సికం, కీరాలకు ఎప్పుడూ మార్కెట్‌ ఉంటుంది. మార్కెట్‌ సరళిని బట్టి పూల సాగు చేపట్టాలి..   
– వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్‌

మరిన్ని వార్తలు