ఉద్యోగాలన్నీ పచ్చగా..

22 Sep, 2019 04:54 IST|Sakshi

ఆర్థిక మాంద్యం, కాలుష్యానికి చెక్‌ 
ఒకవైపు ఆర్థికమాంద్యం పెద్ద పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగాలకు కోత పెడుతోంది.. మరోవైపు కాలుష్యభూతం పెద్ద నగరాల నుంచి చిన్న పల్లెల్నీ భయపెడుతోంది.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీనిని ఎలా ఎదుర్కోవాలి ? ప్రత్యామ్నాయాలేంటి?..  ఉన్నాయనే అంటున్నారు నిపుణులు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలని అంటారే అచ్చంగా అలాగే ఈ రెండు సమస్యల పరిష్కారానికి సమాధానం ఒకటే. అవే గ్రీన్‌ జాబ్స్‌.. 

గ్రీన్‌ జాబ్స్‌ అంటే..
పర్యావరణానికి మేలు చేసే ఏ ఉద్యోగాన్నైనా గ్రీన్‌ జాబ్‌ అనే అంటారు. సంప్రదాయేతర ఇంధనాల వినియోగాన్ని పెంచుకోవడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. అదే గ్రీన్‌ ఎకానమీకి బాటలు వేస్తుంది. అప్పుడే ఉద్యోగాలు పచ్చగా కళకళలాడతాయి. అన్నింటికి మించి గ్రీన్‌ జాబ్స్‌ కల్పనలో మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే స్థానికంగా ఎక్కడికక్కడ ఈ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వలసలకు అడ్డుకట్ట వేయొచ్చు. 

గ్రీన్‌ జాబ్స్‌ రంగాలు..
థర్మల్, జల విద్యుత్‌కి బదులుగా సౌర, పవన విద్యుత్‌ని విస్తృతంగా వినియోగంలోకి తెస్తే దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు పెరుగుతాయి. సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కావల్సిన సౌర ఫలకాలు సహా విడిభాగాల తయారీ పరిశ్రమలు, వాటి నిర్వహణ, మరమ్మతు వంటి వాటి ద్వారా కొత్త ఉద్యోగాలొస్తాయి. ఇక ఎల్‌ఈడీ బల్బుల తయారీని కూడా ప్రోత్సహిస్తే పరోక్షంగా అవి పర్యావరణానికి మేలు చేస్తాయి. 

నైపుణ్యమే అడ్డంకి..
ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనం, పర్యావరణ కాలుష్యం నుంచి బయటపడాలంటే గ్రీన్‌ జాబ్స్‌ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యత సాధిస్తూనే రీ సైక్లింగ్, రీ మాన్యుఫ్యాక్చర్, నీళ్ల శుద్ధి, వ్యర్థాల శుద్ధి వంటివి చేయాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై బాగా అవగాహన ఉండాలి. యువతలో నైపుణ్యం కొరతే భారత్‌లో గ్రీన్‌ జాబ్స్‌ కల్పనకి ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ గ్రీన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద వచ్చే మూడేళ్లలో 5 లక్షల 50 వేల మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అంశంలో థాయ్‌లాండ్‌ ఎన్నో దేశాలకు ఆదర్శం. ఇప్పటికే ఆ దేశం గ్రీన్‌ జాబ్స్‌ చేయడానికి అనుకూలంగా విద్యావ్యవస్థలోనే మార్పులు తీసుకువచ్చింది.

వ్యర్థాల నిర్వహణ..
దేశవ్యాప్తంగా ప్రతీరోజూ 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతోంది. ఇందులో 20% వ్యర్థాల్ని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలినదంతా ఖాళీ ప్రదేశాల్లో నింపేస్తున్నారు. దీంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అదే వ్యర్థాల శుద్ధి యూనిట్లను గ్రామస్థాయి నుంచి నగరాల వరకు ఏర్పాటు చేస్తే కాలుష్యాన్ని నివారించడంతో పాటుగా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. వ్యర్థాల సేకరణ నుంచి వాటిని ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలించే వరకు లెక్కలేనన్ని ఉద్యోగాలు వస్తాయి.

గ్రీన్‌ రవాణా..
మనం పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్న వాటిల్లో రవాణా రంగం వాటా కూడా ఉంది. ఎలక్ట్రికల్‌ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలను వినియోగంలోకి తీసుకురాగలిగితే వాటి తయారీ, నిర్వహణ, సేవా రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాలుష్యానికి కూడా చెక్‌ పెట్టొచ్చు. 

నగరాల అటవీకరణ
పట్టణాలు, నగరాల్లో రూఫ్‌ గార్డెన్లు పెంచడం, ఏ కాస్త ఖాళీ జాగా దొరి కినా నాలుగు మొక్కలు నాటేయడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్‌. దీంతో కూడా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. 

గ్రీన్‌ జాబ్స్‌ కల్పనలో భారత్‌ స్థానం: 5 (అంతర్జాతీయ సంప్రదాయేతర ఇంధన సంస్థ ప్రకారం చైనా, యూరోపియన్‌ యూనియన్,  బ్రెజిల్, అమెరికా మొదటి నాలుగు స్థానాల్లోనూ ఉన్నాయి)
గ్రీన్‌ అకానమీ వైపు భారత్‌ అడుగులు వేస్తే వచ్చే ఉద్యోగాలు: 2.4 కోట్లు; ఒక్కో కార్పొరేషన్‌లో వచ్చే ఉద్యోగాలు: 9 వేలకు పైగా; నగర మున్సిపల్‌ కౌన్సిల్‌:  2,000; పట్టణ మున్సిపల్‌ కౌన్సిల్‌: 650

urbanization

మరిన్ని వార్తలు