కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్

19 Aug, 2014 03:32 IST|Sakshi

గద్వాల : జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్  నుంచి నాలుగు జిల్లాల్లో దాదాపు 20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టనున్న రెండు కొత్త ప్రాజెక్టుల సర్వేలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సోమవారం నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు సంబంధిత సర్వే సంస్థలతో ఒప్పందాలు ఖరారు చేశారు. మూడు నెలల్లోగా రెండు కొత్త ప్రాజెక్టుల సమగ్ర సర్వేలను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి కీలకంగా భావిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వేను చేపట్టేందుకు రూ. 49లక్షలు అవసరమని జూరాల అధికారులు ఈఎన్‌సీ కార్యాలయంలో నివేదిక సమర్పించారు.
 
 ఇలా మూడు ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేల నిర్ణయాలు హైదరాబాద్‌లో జరిగిపోయాయి. జూరా ల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మూడు జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రతిపాదించిన పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేను రూ.5.71కోట్లతో చేపట్టేందుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలే జ్ ఆఫ్ ఇండియా సంస్థ మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు సర్వే సంస్థ మధ్య ఒప్పందాలు కుదిరాయి.
 
 అలాగే జూరాల రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా మరో మూడు జిల్లాల పరిధిలో 10లక్షల ఎకరాలకు ఆయకట్టు నీటిని అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన జూరాల-పాకాల ప్రాజెక్టు సర్వేను 3కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వరంగ సర్వే సంస్థవాట్‌కాస్ చేపట్టనుంది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, వాట్‌కాస్‌సంస్థ అధికారులు ఒప్పందం ఖరారు చేసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల సర్వేలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించా రు. జూరాల అధికారులు సమర్పించిన తుమ్మిళ్ల సర్వే నివేదిక మేరకు ప్రభుత్వం రూ.49లక్షలను విడుదల చేస్తే త్వరలోనే ఇందుకు సంబంధించిన సర్వే పనులను మరో సంస్థకు అప్పగించనున్నారు.
 
 పాలమూరు ఎత్తిపోతల పథకం...
 పాలమూరు ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8న 6.91కోట్లకు మంజూరు ఇచ్చింది. ఈ పథకం సర్వే చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే జూరాల అధికారులు టెండర్లు పిలిచారు. ఈ సర్వే పనులను ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు జూరాల ఇంజనీర్లే ప్రాథమికం గా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ దశలో సీఎం కేసీఆర్ సమీక్ష చేసి తక్షణం సర్వే చేపట్టాలని, అవసరమైన నిధులను విడుదల చేస్తామని ఆదేశించడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ఐదుచోట్ల లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిజైన్ రూపొందిస్తున్నారు.   
 
 జూరాల - పాకాల ప్రాజెక్టు...
 కృష్ణానది నీటిని మళ్లించి మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గ్రావిటీ ఫ్లో ద్వారా 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా డిజైన్ రూపొందించారు. గత నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి అధికారులకు ఆదేశాలివ్వడంతో డిజైన్‌లో కొంత మార్పులు చేసి ప్రాథమిక సర్వేను సిద్ధం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 312 మీటర్ల ఎత్తు నుంచి నీటిని వరంగల్ జిల్లా పాకాల వద్ద 262 మీటర్ల డౌన్ వరకు తరలించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. జూరాల ప్రాజెక్టు నుంచి పాకాల వరకు మొత్తం 410 కిలోమీటర్ల పొడవునా ప్రధాన కాలువను నిర్మించాల్సి ఉంటుంది. మూడు జిల్లాల్లో 617 చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతో పాటు పది లక్షల ఎకరాలకు కృష్ణానది జలాలను ఈప్రాజెక్టు ఆయకట్టు భూములకు అందిస్తుంది. సాగునీటితో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ఈ రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.
 
 ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు తుమ్మిళ్ల...
 ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మూడు దశాబ్దాలుగా సాగునీరెరగని మానవపాడు, అలంపూర్, వడ్డేపల్లి మండలాల పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీళ్లం దించేందుకు తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలను అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇందుకుగాను జూరాల అధికారులు సర్వేకు అవసరమైన నిధుల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సమగ్ర సర్వే (డీపీఆర్) చేసేం దుకు రూ.49లక్షలు అవసరమని పేర్కొన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా కనీసం 10 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో అందేలా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించేందుకు అధికారులు నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు