సీఎం ఆమోద ముద్ర

20 Jun, 2019 02:56 IST|Sakshi

రాష్ట్రంలో మెడికల్‌ సీట్లలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు గ్రీన్‌సిగ్నల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10% రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019–20 వైద్య విద్యా ఏడాదిలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. 10% రిజర్వేషన్ల అమలుకు 25% సీట్ల పెంపు తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రతిపాదలను పంపాలని కోరింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 312 ఎంబీబీఎస్‌ అదనపు సీట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుము ఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు.. 
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అప్పుడు ఉత్తర్వులు జారీకాలేదు. నీట్‌ ఫలితాలు వచ్చి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ కూడా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విద్యార్థుల చేతికి వచ్చాయి. దీంతో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. 

ఇప్పటికే మెడికల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయాల్సిన ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వ ఉత్తర్వుల కోసమే ఎదురుచూస్తోంది. ఉత్తర్వులు రాకుండా నోటిఫికేషన్‌ జారీచేస్తే రిజర్వేషన్లు ఈ ఏడాదికి అమలు కాకుండా పోతాయి.  వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల తీరువల్ల ఉత్తర్వుల జారీ కాస్తంత ఆలస్యమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఎం ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు రానున్నాయి.  

ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ.. 
ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులో ప్రధానంగా అమలుతీరుపైనే మార్గదర్శకాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉంటుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఈ మేరకు ఆదేశాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అఖిల భారత సీట్లలో చేరే విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్‌ కాలేజీ సీట్ల భర్తీకి తాజాగా ధ్రువీకరణ పత్రాలు జారీచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వమూ రూ.8 లక్షల లోపు ఆదాయమే నిర్ణయిస్తే, ఇప్పటికే కేంద్ర సీట్ల కోసం తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా