తెలంగాణలో పవన విద్యుదుత్పత్తి

25 Dec, 2014 00:09 IST|Sakshi

ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రీన్‌కో సంస్థ  
అవకాశాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
రూ. 6 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ‘గ్రీన్‌కో’ సంస్థ వెల్లడి
2018 నాటికి 800 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టు
స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు భారీగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని లక్ష్యంగా ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం... సౌర, పవన విద్యుదుత్పత్తిపైనా దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలకు కూడా ఆహ్వానించింది. దీంతో తెలంగాణలో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవమున్న ‘గ్రీన్‌కో’ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం తాము రూ. 6 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. 2018 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పేర్కొంటూ సంబంధిత ప్రతిపాదనలను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ‘గ్రీన్‌కో’ సంస్థ అందించింది. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదఢఢేశించారు.
 
 ఇప్పటికే సౌర విద్యుత్‌కు ఒక దఫా టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని సూచించారు.  రాష్ట్రంలో దాదాపు రెండు వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉందని.. పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పవన విద్యుత్ ప్లాంట్లను కూడా ఎక్కువ ప్రాంతాల్లో స్థాపిస్తే ఉపయోగం ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విద్యుత్ అవసరాలు ఉన్న చోట పవన విద్యుత్ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇప్పటికే అనుభవం ఉన్న సంస్థలతో ఈ పని చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
 
 రాజధానిలో నిరంతరం విద్యుత్
 హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. న్యూయార్క్, ముంబై వం టి నగరాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లే హైదరాబాద్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంద ని... పరిశ్రమలు, ఐటీ సంస్థలు, వ్యాపార, వాణి జ్య సంస్థలు 24 గంటలు పని చేసినా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా