పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత 

26 Jun, 2019 03:06 IST|Sakshi

ప్రభుత్వ పరంగా సిద్ధమైన కార్యాచరణ

దోమల నిరోధానికి వారంలో ఓ రోజు ‘డ్రై డే’ నిర్వహణ

విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్న పంచాయతీ రాజ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామసీమలను పచ్చదనం, పరిశుభ్రతకు కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వపరంగా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలతోపాటు వాటి అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నగరాల్లో పౌరులకు అందుబాటులోకి వచ్చే సౌకర్యాలన్నీ కూడా పల్లె ప్రజలకు కూడా అందేలా మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యక్రమాలను రూపొందించింది.

పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి గతంలోనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. వీటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు పీఆర్‌ శాఖ కొన్ని రోజుల క్రితం ఒక మెమోను కూడా జారీ చేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు సంబంధించిన పనుల పర్యవేక్షణను గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతోపాటు ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు చేపట్టాలని సూచించింది. అన్ని గ్రామాల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌లు, డీపీవోలు, డీఎల్‌పీవోలు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.  

పంచాయతీల్లో ’డ్రై డే’.. 
గ్రామ పంచాయతీల్లో దోమల వృద్ధి లేకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ’డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే పీఆర్‌ శాఖ సూచించింది.  

ఈ–పంచాయతీలు... 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని గ్రామ పంచాయతీలను ఈ–పంచాయతీలుగా మార్చే క్రమంలో సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిని ఉపయోగించుకోవడంతోపాటు మెరుగైన సాంకేతికతలను అనుసరించే దిశలో చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌లో వివిధ కార్యకలాపాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంచాయతీల్లో ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పంచాయతీ మాడ్యుల్స్‌ను అప్‌లోడ్‌ చేయడం వంటివి పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)ను పీఆర్‌ శాఖ ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల పర్మిషన్లను ఆన్‌లైన్‌లోనే జారీ చేసేందుకు వీలుగా సాంకేతిక పరమైన వసతులు సమకూర్చుకోవాలని సూచించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, భూరికార్డుల మ్యుటేషన్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ వంటి వాటిని ఆన్‌లైన్‌లోనే అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా అక్కడే రిజిష్టర్‌ చేసేలా చూడాలని సూచించింది. పంచాయతీ కార్యదర్శులకు పనితీరు సూచికలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు