ఢిల్లీ తరహాలో హరిత సొబగులు

14 Nov, 2017 01:22 IST|Sakshi

పబ్లిక్‌ టాయిలెట్ల కోసం హైదరాబాద్‌లోని 

45 ప్రాంతాల్లో స్థలాలు సేకరించండి: మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: న్యూఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ (ఎన్డీఎంసీ) ఆధ్వర్యంలో ఢిల్లీ నగరంలో చేపట్టిన పచ్చదనం నిర్వహణ, ఇతర పనులను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్‌లో సైతం పచ్చదనాన్ని మరింత వృద్ధి చేస్తామని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పచ్చదనం పెంపునకు నగరంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఎంసీ ప్రతినిధి బృందంతో సోమవారం కేటీఆర్‌ సచివాలయంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు.

ఎన్డీఎంసీ బృందం ఢిల్లీలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రికి వివరించింది. తెలంగాణలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్లా జీహెచ్‌ఎంసీ సైతం గార్డెనింగ్‌ బాగా చేస్తోందని అభినందించింది. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్‌ పనుల తీరు ప్రశంసించారు. ఢిల్లీ తరహాలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణానికి కనీసం 45 స్థలాలను ఎంపిక చేయాలని మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. పార్కుల నిర్వహణకు అవసరమైన నీటి కోసం మినీ ఎస్టీపీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఎన్డీఎంసీ తరహాలో స్ట్రీట్‌ స్కెపింగ్‌ కోసం ఢిల్లీలో పర్యటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు.   

మరిన్ని వార్తలు