పారిశుధ్యం నిరంతరం కొనసాగాలి 

6 Jun, 2020 04:09 IST|Sakshi

సీఎస్‌  సోమేశ్‌కుమార్‌ 

సాక్షి, సంగారెడ్డి/సాక్షి, కామారెడ్డి/సాక్షి, వికారాబాద్‌: పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 1 నుంచి పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లా ల్లో గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడడానికి అధికారులకు సమాచారం లేకుండా ఆకస్మికంగా వచ్చానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని ఎద్దుమైలారం, కొండాపూర్‌ మండలంలోని గుంతపల్లి గ్రామాల తనిఖీ సందర్భం గా మాట్లాడుతూ..జిల్లాలో రెండు గ్రామాలను పరిశీలిస్తే పారిశుధ్య కార్యక్రమాలు బాగా చేసినట్లు ఉందన్నారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను రాష్ట్ర వ్యాప్తం గా ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. త్వరలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొక్కలను విరివిగా నాటా లని, ప్రతి గ్రామంలో ఓ నర్సరీ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

ప్రతి నెలా రూ.380 కోట్లు..  
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లి,  కామారెడ్డి మండలంలోని గుర్గుల్‌ గ్రామాల్లో తనిఖీల సందర్శంగా సీఎస్‌ మాట్లాడుతూ, గ్రామాల్లో మొదటి, రెండో దశల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.380 కోట్లు మంజూరు చేస్తోందన్నారు. వికారాబాద్‌ జిల్లా పెండ్లిమడుగు, దాతాపూర్‌ గ్రామాల్లో తనిఖీ పూర్తయిన అనంతరం మాట్లాడుతూ, ఆకస్మిక తనిఖీ తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లాలో వైకుంఠధామాల్లో బాడీ ఫ్రీజర్లు ఉంచాలన్న ఆలో చన నచ్చిందని, వికారాబాద్‌లో నర్సరీలు బాగున్నాయని చెప్పారు. త్వరలోనే రైతుల ద్వారా ఆగ్రోఫారెస్టీ విధానం అమలులోకి తెస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా